జెడ్పీ పీఠంపై గురి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠంపై గురి

Aug 26 2025 8:32 AM | Updated on Aug 26 2025 8:32 AM

జెడ్పీ పీఠంపై గురి

జెడ్పీ పీఠంపై గురి

ఖాతా తెరవని కాంగ్రెస్‌ కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ కసరత్తు పోటీ సిద్ధమవుతున్న నేతల సతీమణులు, వారసులు ‘హస్తం’లో అధికంగా ఆశావహులు

ఇప్పటి వరకు టీడీపీ, బీఆర్‌ఎస్‌లకే అవకాశం

వికారాబాద్‌: జిల్లా పరిషత్‌ పీఠం కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్న తరుణంలో ఆశావహులు జెడ్పీ పీఠంపై కన్నేసిన నేతలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మండల, జిల్లా పరిషత్‌లు ఏర్పాటైన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలోగాని, ప్రస్తుత వికారాబాద్‌ జిల్లాలో గాని టీడీపీ, బీఆర్‌ఎస్‌ జెండాలే ఎగురవేశాయి. అధికార కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు జెడ్పీ పీఠం దక్కించుకున్న దాఖలాలు లేవు. వికారాబాద్‌ హ్యాట్రిక్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతారెడ్డి తన పదవీకాలం ముగిసే మూడు నెలల ముందు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ మూడు నెలలు మాత్రం పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగిరినట్లయింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌ జిల్లాకు చెందిన వారే ఉండడంతో పాటు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే ఉండడంతో గెలుపు నల్లేరుపై నడకే కానుందని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఆశావహులు సైతం ఇదే మంచి సమయమని పరిషత్‌ పీఠం కోసం పోటీ పడుతున్నారు.

‘పట్నం’వారసుడి రంగప్రవేశానికి ప్రయత్నాలు

జిల్లాలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో పోటీ అధికమయింది. ప్రతీ నియోజకవర్గం నుంచి నేతలు పోటీ పడుతున్నారు. మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం ఏపదవి లేకుండా ఉన్నారు. ఆమె కూడా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అవకాశం కలిసి వస్తే తన కుమారుడిని సైతం జెడ్పీటీసీగా పోటీ చేయించి జిల్లా పరిషత్‌ గద్దెనెక్కించి రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూతురిని జిల్లా పరిషత్‌ ఎన్నికల రంగంలోకి దించాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు కోరుతున్నారు. ఇదే నియోజకవర్గానికి రఘువీరారెడ్డి, సుధాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి సైతం బరిలో ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

పరిగి, తాండూరు నుంచి పోటీ

పరిగి, తాండూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు సైతం జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి సతీమణిని పరిషత్‌ ఎన్నికల రంగంలోకి దింపాలని నియోజకవర్గ కార్యకర్తలు నేతలు కోరుతున్నారు. రామ్మోహన్‌రెడ్డి ఆశీర్వదిస్తే తాము సైతం పరిషత్‌ బరిలో ఉండేందుకు సిద్ధమని అదే నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు హన్మంత్‌ ముదిరాజ్‌, లాల్‌కృష్ణప్రసాద్‌ పేర్కొంటున్నారు. తాండూరుకు చెందిన పలువురు నేతలు సైతం జిల్లా పరిషత్‌ పీఠంపై గురిపెట్టారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి, రిజర్వేషన్‌ మహిళలకు కేటాయిస్తే ఆయన సతీమణిని రంగంంలోకి దించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మురళీకృష్ణ తదితరులు సైతం ఆ సీటును ఆశిస్తున్నట్టు సమాచారం.

ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు

జిల్లా పరిషత్‌ పీఠంను ఆశిస్తున్న నేతలు జిల్లాకు చెందిన ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని ఆశీస్సులు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవటంతో పాటు స్థానిక కేడర్‌ మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆశావహుల్లో ఎమ్మెల్యేల సతీమణులు, కూతుళ్లు, ఇతర ముఖ్యనేతలు సైతం ఉండటంతో వారు నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పరిణామాలు, సమీకరణలు, రిజర్వేషన్లు ఎలా ఉన్న జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఈ ఎన్నికల్లో కీలకమని ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement