
అయ్యా.. యూరియా
ఆధార్ కార్డుకు ఒక్క బస్తా
ధారూరు: యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి వేచి చూస్తే ధారూరు పీఏసీఎస్‌కు సోమవారం 280 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకున్నారు. సంఘం సిబ్బంది యూరియా పంపిణీకి ఈ పాస్ యంత్రం ఓపెన్ చేయడంతో మొరాయించింది. దీంతో సిబ్బంది కార్యాలయం లోపలే ఉండిపోయారు. ప్రతీ రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బాటిల్ లిక్విడ్ నానో యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ససేమీరా అన్నారు. రైతుల తోపులాట కారణంగా ఒకింత ఉద్రిక్తతత నెలకొంది. విషయం తెలుసుకున్న వ్యవసాయ విస్తరణ అధికారులు సంజూరాథోడ్, సంతోశ్‌లు, ఎస్‌ఐలు రాఘవేందర్, గోపాల్‌లు అక్కడ చేరుకున్నారు. ఈపాస్ యంత్రం పనిచేయడం లేదని రైతులు సంయమనం పాటించాలని సూచించారు. పోలీసులను చుట్టి ముట్టి యూరియా ఇప్పించాలని పట్టుబట్టారు. చివరకు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అభ్యర్థన మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజారత్నం ఆధార్‌కార్డు ద్వారా యూరియా ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. వచ్చిన రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. సరిపడా యూరియా లేక పోవడంతో టోకెన్లు ఇస్తామని చెప్పడంంతో రైతులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
పదేళ్లు లేని కొరత ఇప్పుడు ఎందుకు?
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
మోమిన్‌పేట: పదేళ్లలో లేని యూరియా కొరత కాంగ్రెస్ పాలనలోనే ఎందుకు వచ్చిందో చెప్పాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు అనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని పీఏసీఏస్ గోదాంను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులను పక్కదారి పట్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను గాలికొదిలేసిన రాష్ట్ర మంత్రి వర్గం ఢిల్లీ పర్యటనలు, పాదయాత్రలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం రైతు సమస్యలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎరువులు, రైతు బంధు క్రమం తప్పకుండా అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్, మాజీ సర్చంచ్‌లు ఎ.శ్రీనివాస్‌రెడ్డి, పి. శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, రైతులు తదితరులు ఉన్నారు.

అయ్యా.. యూరియా