
గైరుహాజరు!
వికారాబాద్: విధులకు రాకుండానే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినట్లు హాజరు వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీలోని లూప్ హోల్స్‌ను పసిగట్టి విధులకు ఎగనామం పెడుతున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. దీంతో అసలు దొంగలు దొరికిపోయారు. పంచాయతీరాజ్, విద్యా శాఖల్లో ఈ వ్యవహారం బయటపడింది. పదిహేను రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలోని పలు పాఠశాలలను కలెక్టర్ ప్రతీక్‌జైన్ తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంత మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు.. కానీ ఆన్‌లైన్‌లో వచ్చినట్లు రికార్డు కావడంతో పూర్తిస్థాయి విచారణ జరపాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చాలా వరకు పంచాయతీ కార్యదర్శులు విధులకు రాకుండానే ఇంటి వద్ద నుంచే హాజరు వేసుకున్నట్లు గుర్తించారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉండగా 553 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 63 మంది విధులకు రాకుండానే హాజరు వేసుకున్నట్లు తేలింది. దీంతో వీరందరికీ చార్జి మెమోలు జారీ చేశారు. విద్యా శాఖలో 4,588 మంది ఉపాధ్యాయులు ఉండగా 75 మంది ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం కార్మికుల హాజరు ఆన్‌లైన్ చేయలేదు. ఈ విషయాలపై ఎంఈఓల నుంచి వివరణ కోరారు.
అన్ని శాఖల్లో ఆన్‌లైన్ హాజరు
విధుల్లో పారదర్శకత తేవడానికి ఆన్‌లైన్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అమలు చేస్తున్నారు. జూన్ చివరి వారంలో విద్య, ఆరోగ్య శాఖల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. జూలై మొదటి వారంలో అన్ని శాఖలకు విర్తింపజేశారు. కలెక్టరేట్‌లో కూడా అమలు చేశారు. ఆరోగ్య శాఖ పరిధిలో 24 పీహెచ్‌సీలు ఉండగా రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ పరిధిలో 1,063 పాఠశాలలు ఉండగా ముందుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని శాఖల్లో అమలు చేస్తున్నారు. జిల్లాలో 6,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖలో 4,588 మంది ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖలో 600 పైచిలుకు మంది, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 650 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.
ప్రతి నెలా పర్యవేక్షిస్తేనే..
గతంలో కలెక్టరేట్, విద్య, ఆరోగ్యశాఖల్లో మాత్రమే బయోమెట్రిక్ విధానం అమలు చేసేవారు. గత కలెక్టర్ నారాయణరెడ్డి జీయో అటెండెన్స్ పేరుతో ఆన్‌లైన్ హాజరు విధానం అమలు చేశారు. ఆయన బదిలీపై వెళ్లడంతో ఆ విధానానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత విధి నిర్వహణ, రోజువారి హాజరులో పారదర్శకత కొరవడింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్‌జైన్ తిరిగి ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా చేయాలని నిర్ణయించారు. గత ఫెయిల్యూర్స్‌ను దృష్టిలో ఉంచుకొని నెలవారి పర్యవేక్షణ ఉంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందనేది స్పష్టమవుతోంది. గతంలోనూ ఆన్‌లైన్ హాజరు విధానం అమలు చేసినా ఎవరెవరు ఎన్ని రోజులు విధులకు డుమ్మా కొట్టారు.. ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారు.. అనే వివరాలు గుర్తించలేదు. హెచ్చరించడం కానీ శాఖాపరమైన చర్యలు తీసుకోవటం లాంటివి చేయలేదు. దీంతో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకాడం మానేసరనే విమర్శలు ఉన్నాయి.
ఆన్‌లైన్ హాజరు విధానాన్ని కొంతమంది పంచాయతీ కార్యదర్శులు మిస్‌యూజ్ చేశారు. ఈ విషయం మా దృష్టికి రావడంతో మా వద్ద ఉన్న ఫేస్ రీడింగ్ యాప్‌లో చెక్ చేశాం. 63 మంది తప్పు చేసినట్లు గుర్తించాం. వారికి చార్జి మెమోలు ఇచ్చాం. ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాం. నిత్యం ఆన్‌లైన్ హాజరును పరిశీలిస్తున్నాం.
– జయసుధ, డీపీఓ
టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న సిబ్బంది
విధులకు రాకుండానేహాజరైనట్లు ఆన్‌లైన్‌లో నమోదు
ఉన్నతాధికారుల నిఘాతో
బయటపడిన భాగోతం
63 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జిమెమోలు