రైతుల ఖాతాల్లో రూ.48 కోట్లు జమ
వికారాబాద్ జిల్లా: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ హెచ్చరించారు. సోమవారం దోమ మండల కేంద్రంతో పాటు ఆయా సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 128 కేంద్రాల ద్వారా 33,226 మెట్రిక్ టన్నులు సేకరించి మిల్లులకు తరలించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.48 కోట్లు జమ చేసినట్లు వివరించారు.
అనంతరం మోత్కూర్‌లోని మహాలక్ష్మి రైస్‌మిల్లు, పరిగి పట్టణంలోని శ్రీ వెంకట సాయి రైస్ మిల్లును సందర్శించారు. ధాన్యం నిల్వ లు తడవకుండా చూసుకోవాలని మిల్లు యాజమానులకు సూచించారు. లారీలను ఖాళీ చేయించి త్వరితగతిన కొనుగోలు కేంద్రాలకు పంపించేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ తుక్యానాయక్, డీటీ గణేశ్ పాల్గొన్నారు.


