భూ భారతితోనైనా.. సమస్య తీరేనా!
ఏడేళ్లుగా నష్టపోతున్నాం
మా పొలం ఆన్‌లైన్‌లో లేకపోవడంతో ఏడేళ్లుగా నష్టపోతున్నాం. బ్యాంకు రుణాలు అందలేదు. రైతు భరోసా సైతం రాకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు దూరమయ్యాం. మా సొంత భూమిలో నుంచి రోడ్డు వెళ్లింది. అందులో ఆరు గుంటలు పోయింది. కానీ మా పేరున ఉన్న మొత్తం భూమి ఆన్‌లైన్‌లో కట్ అయింది.
– రఘురాంరెడ్డి , రైతు, సోమన్‌గుర్తి
భూ భారతిలో పరిష్కరిస్తాం
ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ద్వారా బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. రోడ్డు విస్తరణలో రాకంచర్ల, సోమన్‌గుర్తి రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో లేని కారణంగా ప్రభుత్వ పథకాలు అందలేదు. వచ్చే నెల నుంచి గ్రామ సభలు నిర్వహించేలా కలెక్టర్ ఆదేశించారు. వివరాలు సేకరించి త్వరలోనే రైతుల సమస్యను పరిష్కరిస్తాం.
– భరత్‌గౌడ్, తహసీల్దార్, పూడూరు
పూడూరు: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు భరోసాకు దూరమైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చేసిన చిన్నతప్పిదం వల్ల ఆన్‌లైన్‌లో వీరి పేర్లు గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పూడూరు మండలం సోమన్‌గుర్తి, రాకంచర్ల, గ్రామాలకు చెందిన రైతుల పొలాలు బీజాపూర్ జాతీయ రహదానికి ఇరువైపులా ఉన్నాయి. 25 మందికి సంబంధించి వంద ఎకరాల భూమి గల్లంతైంది. రోడ్డులో పోయిన భూమిని సర్వే చేసి, ఆ విస్తీర్ణాన్ని మాత్రమే రికార్డుల నుంచి తొలగించాలి. కానీ మొత్తం భూమి ఆన్‌లైన్‌లో నుంచి వెళ్లిపోయింది. రోడ్డులో భాగంగా పోయిన భూమిని లెక్కగట్టి పరిహారం అందించిన అధికారులు, మిగిలిన భూమికి డిజిటల్ సైన్ చేయలేదు. దీంతో ఈ వివరాలన్నీ మాయమయ్యాయి. సమస్యను పరిష్కరించాలని కోరుతూ నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని బాధితులు పేర్కొంటున్నారు. ధరణిలో దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ లాగిన్‌లోకి వెళ్లిందని తెలిపారు. అక్కడికి వెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వాపోతున్నారు. కనీసం భూభారతి ద్వారా అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.
ధరణి వెబ్‌సైట్‌లో
భూముల వివరాలు మాయం
ఏడేళ్లుగా కార్యాలయాల చుట్టూ
తిరుగుతున్న రైతులు
ప్రభుత్వ పథకాలు,
బ్యాంకు రుణాలకు దూరం
కొత్త చట్టం కోసం ఆశగా ఎదురుచూపు
భూ భారతితోనైనా.. సమస్య తీరేనా!


