అరాచకాలను తట్టుకుని విజయం | - | Sakshi
Sakshi News home page

అరాచకాలను తట్టుకుని విజయం

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

● 6 మండలాల్లో 3 జెడ్పీటీసీలను కై వశం చేసుకున్న వైఎస్సార్సీపీ ● పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో రీపోలింగ్‌? ● పోలింగ్‌ అక్రమాలపై ఆధారాలను సేకరించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ● ఇప్పటికే రిగ్గింగ్‌ అంశంపై కలెక్టర్‌ను వివరణ కోరిన ఎస్‌ఈసీ

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి ఒక్క నామినేషన్‌ పడకుండా చూడాలని ఎమ్మెల్యే నాని నాయకత్వంలోని టీడీపీ నేతలు దౌర్జన్యకాండను సృష్టించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అభ్యర్థులను బెదిరించారు. నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేశారు. పలు నామినేషన్‌ కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో 24 మంది వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా వారు లెక్క చేయలేదు. రక్తం కార్చుకుంటూ నే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత ఎన్నికల అధికారులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ నేతలు ఏకగ్రీవం చేసుకున్నారు.

పోలింగ్‌లోనూ అక్రమాలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు, ప్రైవేట్‌ సైన్యాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గ వ్యాప్తంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ జనరల్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు తీసుకుని వచ్చి దాడులు చేశారు. పోలింగ్‌ ముందు రోజే అనేక మంది వైఎస్సార్సీపీ నేతలను బైండోవర్‌ పేరుతో పోలీస్‌ స్టేషన్లకు రప్పించారు. చాలా మందిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తిరుపతి నగరంతో పాటు తమిళనాడు నుంచి రౌడీలను రప్పించి దొంగ ఓట్లు వేయించారు. ప్రధానంగా తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ స్థానంలో ఉన్న చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డిని ఎలాగైనా ఓడించి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్యాడర్‌ను మానసికంగా దెబ్బకొట్టాలని పులివర్తి నాని వేసిన వ్యూహ్యాన్ని చెవిరెడ్డి కుటుంబం తిప్పికొట్టింది.

కౌంటింగ్‌లోను దౌర్జన్యమే

ఓట్ల లెక్కింపులోనూ టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఎన్నికల అధికారులచేత వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చెందిన ఓట్లను చెల్లనివిగా లెక్క కట్టించారు. ఒక్క తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ పరిధిలోనే వైఎస్సార్సీపీకి వచ్చిన సుమారు 1,500 ఓట్లు చెల్లనివిగా లెక్కలోకి వేయించారు. అనేక మార్లు కౌంటింగ్‌ను నిలిపి వేయించారు. ఎన్ని అడ్డంకులు చేసినా చివరకు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి 563 ఓట్ల మెజారిటీతో గెలిచారు. విజయం ప్రకటించిన అధికారులు రెండు గంటలపాటు డిక్లరేషన్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. ఇలా ఎన్నిరకాలుగా ప్రయత్నించినా తిరుపతి రూరల్‌లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. అలాగే చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం జెడ్పీటీసీలుగా బాలం యుగంధర్‌రెడ్డి, ఊటుకూరు రెడ్డెమ్మ విజయకేతనం ఎగురవేశారు. వీరి విజయం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు అస్సలు మింగుడుపడడం లేదని సమాచారం.

ఆ మూడు మండలాల్లో రీపోలింగ్‌?

పాకాల, చంద్రగిరి, రామచంద్రపురం మండలాల్లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ మూడు మండలాల్లో ఈ నెల 5న జరిగిన పోలింగ్‌లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని. అదే రోజున చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాల నంబర్లను ఇచ్చి అక్కడ ఉన్న సీసీ కెమెరాల వెబ్‌ క్యాస్టింగ్‌ను పరిశీలించాలని హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ వెంటనే ఆ మూడు మండలాల వెబ్‌ క్యాస్టింగ్‌ను చూసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సమయం లేనందువల్ల స్వయంగా పర్యవేక్షించలేమని కలెక్టర్‌ హైకోర్టుకు తెలిపారు. అంతటితో ఆగకుండా ఆ పోలింగ్‌ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ మొత్తం కావాలని వైసీపీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌ను రాతపూర్వకంగా అడిగారు. హైకోర్టు కూడా ఆ పుటేజీని ధర్మాసనం ముందు వుంచాలని ఆదేశించడంతో అక్కడ మళ్లీ ఎన్నికలు వచ్చే చాన్స్‌ ఉన్నట్టు సమాచారం. 2019 శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా రిగ్గింగ్‌ చేసుకున్న 6 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ జరగడం, 12 మంది ఆర్‌ఓలు, పోలింగ్‌ సిబ్బంది సస్పెండ్‌ అయిన విషయాన్ని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement