చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో నవంబర్ 16 (సోమవారం) నుంచి 30 రోజుల పాటు పురుషులకు ఏసీ, రిఫ్రిజిరేటర్ల సర్వీసింగ్‌లపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ బాలకోటి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేస్తామని తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 87908 60657, 96764 50037 నంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు.
ఉద్యోగాల భర్తీకి
స్కిల్ కనెక్ట్ డ్రైవ్
తిరుపతి అర్బన్: ఉద్యోగాలు భర్తీ చేయడానికి స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న తమిళనాడు రాష్ట్రంలోని పొన్నేరి తాలూకా, గుమ్మిడిపూండి వద్ద కొంకన్ స్పెషాలిటీ పాలీప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్–6 గ్రామం సెవిట్టుపకనపాక్కన్ వద్ద ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, 12వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ చదువుకున్నవారు, 18 ఏళ్ల పైబడిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆపరేటర్లు, టెక్నీషియన్లు, డాక్యుమెంటర్స్ తదితర 48 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం నైపుణ్యం.ఏపీ.జీవోవీ.ఇన్ వైబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచని, అదనపు సమాచారం కోసం 9440374535, 9842514480, 9597263254, 9442474603 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
అమ్మవారికి వెండి తట్ట విరాళం
చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి తట్టను విరాళంగా అందించారు. టీటీడీలో సీనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుబ్బరాయుడు సోమవారం ఈ వెండి తట్టను ఆలయ ఏఈఓ దేవరాజులకు అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
సత్యవేడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని వెంకటరాజుల కండ్రిగలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జి.రాజశేఖర్‌యాదవ్(31) దీపావళి సందర్భంగా తన అత్తగారి ఊరు చెరవికి వెళ్లి, సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. సత్యవేడు –తడ మార్గంలోని రాళ్లకుప్పం వద్ద స్టేట్ బ్యాంకు సమీపంలోని మలుపులో సత్యవేడు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న సుందరం ప్రయివేటు బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌యాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీసిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య దేవి(25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు శ్రీసిటీ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.
‘ఆపం’ నిర్వాహకుల రగడ
రేణిగుంట: పట్టణంలోని శ్రీకాళహస్తి రోడ్డులో ఉన్న ఆపం టిఫిన్ సెంటర్ ఎదురుగా ఆదివారం ఉదయం ఆర్టీసీ డ్రైవర్లు, అప్పం టిఫిన్ సెంటర్ నిర్వాహకుల మధ్య రగడ చోటు చేసుకుంది. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల కథనం.. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు రాసుకోవడంతో ఆర్టీసీ బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. డ్రైవర్లు చర్చించుకుంటున్న సమయంలో ఎదురుగా ఉన్న ఆపం టిఫిన్ సెంటర్ నిర్వాహకులు వచ్చి బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యిందని డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ దశలో ఆపం టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేయడానికి యత్నించారు. ఇతర ఆర్టీసీ డ్రైవర్లు కూడా రావడంతో కొంత గందరగోళం నెలకొంది. స్థానికులు కలగజేసుకుని ఇరువురికీ సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.


