తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,010 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,826 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తు లు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్
పోస్టులకు నోటిఫికేన్
తిరుపతి తుడా: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రుల్లో పనిచేసేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు టీటీడీ కార్యాలయం తెలిపింది. మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హత, దర ఖాస్తుతో పాటు మరిన్ని వివరాల కోసం టీటీడీ అధికారక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది.
డిగ్రీ 3వ విడత ప్రవేశాల సీట్ల కేటాయింపు
తిరుపతి సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలలో మూడవ విడత ప్రవేశాల కోసం ఓఏఎమ్‌డీసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపధికన సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఇప్పటికే విద్యార్థులకు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు, ఈ మెయిల్స్‌కు అధికారులు సమాచారమందించారు. సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం నుంచి ఈనెల 7వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేసి ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. మూడవ విడత ప్రవేశాలు ముగిసిన అనంతరం మిగిలి ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు.
8న ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు రద్దు
తిరుపతి తుడా: స్విమ్స్ రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం గర్భిణులకు ఉచితంగా నిర్వహించే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు 8వ తేదీ ఆదివారం దీపావళి పండుగ సెలవు కారణంగా రద్దు చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. 15వ తేదీ ఆదివారం నుంచి స్కానింగ్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
తుపాను నేపథ్యంలో
ముందస్తు ఏర్పాట్లు
తిరుమల: తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా, క్యూలైన్లు బయటకు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి తెలిపారు. ఈ మేరకు సోమవారం తిరుమలలోని పద్మా వతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఘాట్ రోడ్లలో వర్షాల కారణంగా చిన్నచిన్న రాళ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ మనోహరం, ఎస్‌ఈ వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో రాజేంద్ర పాల్గొన్నారు.
15 వరకు గడువు పొడిగింపు
తిరుపతి ఎడ్యుకేషన్:జాతీయ స్థాయిలో 2026– 27వ విద్యాసంవత్సరానికి సంబంధించి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆ మేరకు డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 15వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను అదే నెల 29వ తేదీకి మార్పు చేయడంతో దరఖాస్తు గడువును ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. స్కాలర్‌షిప్‌పై అవగాహన కల్పించి అర్హత ఉన్న విద్యార్థులందరినీ ఎన్‌ఎస్‌పీ పోర్టల్ ద్వారా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు.


