మురసుపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

మురసుపై అప్రమత్తం

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

● కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నం.0877 2236007 ఏర్పాటు

తిరుపతి అర్బన్‌: మురసు తుపాన్‌తో మంగళ, బుధవారాలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదైనట్లు చెప్పారు. అలాగే సోమవారం రాత్రి 11.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ఒంగోలు సమీపంలో మురసు తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తుపాన్‌పై ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షించారు. విద్యుత్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, అగ్రికల్చర్‌, ఇరిగేషన్‌ విభాగాలకు చెందిన అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే మత్స్యకారులను రెండు రోజులుగా వేటకు వెళ్లరాదని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందులు ఉంటే సాయం చేయడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ 0877 2236007 నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు.

విద్యుత్‌ శాఖ సిద్ధం

తిరుపతి రూరల్‌: మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తితే తక్షణమే పునరుద్ధరణ పనులు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ముఖ్యంగా తుపాను ప్రభావం అధికంగా ఉండే నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కోసం ఏడు జిల్లాల నుంచి 2,403 మంది అధికారులు, సిబ్బందితో 226 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తమిళనాడు నుంచి మరో 10 బృందాలను నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రప్పించినట్టు చెప్పారు. తుపాను నేపథ్యంలో విద్యుత్‌ సిబ్బందికి సెలవులను రద్దు చేశామన్నారు. నెల్లూరు, తిరుపతి సర్కిళ్లతోపాటు కార్పొరేట్‌ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.

తుపానుపైనే ఆశలు

మురసు తుపానుపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రతి ఏటా నవంబర్‌లో వచ్చే తుపాను వర్షాలతోనే జిల్లాలోని చెరువులు నిండేవని గుర్తుచేస్తున్నారు. ఇటీవల వచ్చిన అర్నబ్‌ తుపాను ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఒట్టిపోయిన చెరువలే దర్శనమిస్తున్నాయని, మురసు తుపానుతోనైనా వర్షాలు వస్తాయోలేదోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవీ

నెల్లూరు జిల్లా: 94408 17468, తిరుపతి జిల్లా: 94408 17412, కార్పొరేట్‌ కార్యాలయం, 87124 80430, టోల్‌ఫ్రీ: 1912, 1800 425 155333, వాట్సాప్‌: 91333 31912లను సంప్రదించాలని సీఎండీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement