గెలిపించండి.. నాయకులుగా ఎదగండి | - | Sakshi
Sakshi News home page

గెలిపించండి.. నాయకులుగా ఎదగండి

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

● పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు.. పనుల్లో ప్రాధాన్యం ● పార్టీకి వెన్నుపోటు పొడిచేవారిపై ఎన్నికల తరువాత వేటు ● నాలుగు మండలాల్లో నేతలు, కార్యకర్తలకు చెవిరెడ్డి దిశానిర్దేశం

తిరుపతి రూరల్‌: ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకే భవిష్యత్తులో పదవులు, పనుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం గట్టిగా పనిచేసి భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదగాలని సూచించారు. పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం మండలాల్లో సోమవారం పర్యటించిన ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

పాకాలలో రౌడీయిజం లేకుండా చేయాలి

పాకాల మండలంలో చిత్తూరు నుంచి వచ్చిన వారు రౌడీయిజాన్ని తీసుకొచ్చారని చెవిరెడ్డి విమర్శించారు. నామినేషన్ల సమయంలో టీడీపీ శ్రేణులు చేసిన దౌర్జన్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పాకాలలో రౌడీయిజానికి అడ్డుకట్ట వేయాలంటే ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మండలంలోని మద్దినాయునిపల్లికి చెందిన మొగరాల హరిప్రసాద్‌రెడ్డి భార్య స్వర్ణకుమారిని వైఎస్సార్సీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు నామినేషన్‌ వేయిస్తే.. ఓటమి భయంతో టీడీపీ నేతలు అధికారుల ద్వారా ఆమె నామినేషన్‌ను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ తరఫున మరో యువనేత కఫిలేశ్వర్‌రెడ్డి భార్య శ్రీలేఖ పోటీలో నిలిచారని తెలిపారు.

సహదేవరెడ్డికి విజయాన్ని కానుకగా ఇవ్వాలి

చిన్నగొట్టిగల్లులో మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ సహదేవరెడ్డిని అక్రమ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారని చెవిరెడ్డి ఆరోపించారు. ఆయనకు అండగా నిలిచేలా మండలంలోని కార్యకర్తలు పట్టుదలతో అభ్యర్థుల గెలుపుకు పనిచేయాలని కోరారు. మండలంలోని ఏడు ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించి ఆ విజయాన్ని సహదేవరెడ్డికి కానుకగా అందించాలని సూచించారు.

పనిచేసిన వారికే భవిష్యత్తులో ప్రాధాన్యం

పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి గెలుపు కీలకమని చెవిరెడ్డి పేర్కొన్నారు. చిన్న చిన్న విభేదాలతో పార్టీ అభ్యర్థుల విజయానికి ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వెన్నుపోటు పొడిచిన వారిపై వేటు వేయక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 5న జరిగే పోలింగ్‌లో ప్రతి కార్యకర్త జగనన్న సైనికుడిలా పనిచేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement