రైల్వేకోడూరు అర్బన్: జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వస్తుంటే ఓటర్లు, పార్టీ బూత్ ఏజంట్లపై టీడీపీ గూండాలు, పోలీసులు చేసిన గూండాగిరితో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాష్ట్ర అధికారప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆదివారం ధ్వజమెత్తారు. పులివెందులలో ఓటు వేయడం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హక్కని వినియోగించుకోవడానికి వస్తుంటే హెలికాప్టర్ ల్యాండ్ కాకుండా కుట్రలు చేశారని తెలిపారు. జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తి కాన్వాయ్‌లోకి హంతకుడు దస్తగిరి వాహనం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇదంతా డీజీపీ కోయప్రవీణ్‌కు తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. పులివెందులతో పాటు అన్ని ప్రాంతాలలో జరిగిన ఎన్నికల్లో పోలీసులు, ఎన్నికల కమిషన్, అధికారులు టీడీపీ, చంద్రబాబు కోసం పని చేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బానిస అధికారులు కొందరు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే ఆయన ఇంట్లో పని చేసుకోవాలని సూచించారు. ఇలాంటి అధికారులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగ కూడదనే కుట్రతో ఇలాంటి ఘటనలు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని తెలిపారు. ఎన్ని చేసినా చివరకు ప్రజల వద్ద దొరకాల్సిందేనని, వంద జంతువులను తిన్న రాబందు ఒక్క గాలీవానతో కొట్టుకు పోయినట్లు ప్రజలు తిరగబడిన రోజు చంద్రబాబుకు, తప్పు చేసిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.


