తిరుపతి సిటీ: తిరుపతిలోని డాక్టర్ అంబేడ్కర్ గ్లోబల్ లా ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడురోజులుగా ఫియట్ జస్టీషియా పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ న్యాయ మూట్ కోర్టు పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 ప్రముఖ విశ్వవిద్యాలయాలు, న్యాయ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ ఆర్ తిప్పారెడ్డి మాట్లాడుతూ న్యాయ విద్యార్థుల్లో న్యాయ పరిశోధన, న్యాయపరమైన వాదనా పటిమ, న్యాయ నివేదికల తయారీ, విశ్లేషణాత్మక ఆలోచనా విధానం, న్యాయస్థానాల్లో వాదించే నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలు, దేశాల బాధ్యతలు, అంతర్జాతీయ న్యాయ పరిధి తదితర సమకాలీన అంశాలపై మూట్ కోర్టు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.1,35,000 నగదు బహుమతులు, ట్రోఫీని, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి వీఆర్‌కే కృష్ణసాగర్, విశ్రాంత న్యాయమూర్తి ఆన్సర్ బాష, ప్రొఫెసర్ టీవీ సుబ్బారావు, సాంబశివరావు, ప్రిన్సిపాల్ బిజయ్‌కుమార్ బెహెరా పాల్గొన్నారు.


