ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల జిల్లాలో 35 జెడ్పీసీలు, 444 ఎంపీటీసీలకు ఎన్నికలు రేపటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ నవంబర్ 3న ఓటింగ్, 5వ తేదీన కౌంటింగ్ కొలిక్కిరాని ఆర్వో, ఏఆర్వోల డ్యూటీ కేటాయింపులు
తిరుపతి అర్బన్: పల్లె పోరుకు వేళయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలో 35 స్థానాలకు జెడ్పీటీసీ ఎన్నికలు చేపట్టనున్నారు. అలాగే 444 చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల అనంతరం 35 మండలాల ఎంపీపీలను ఎంచుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మహిళలు అధిక సంఖ్యలోనే ఉన్నారు. జెడ్పీటీసీలకు 18 మంది, ఎంపీపీలకు 18 మంది, ఎంపీటీసీలకు 215 మంది మహిళలు పోటీపడనున్నారు. అలాగే పురుషుల్లో చూస్తే జెడ్పీటీసీలకు 17, ఎంపీపీలకు 17, ఎంపీటీసీలకు 229 మంది బరిలో నిలవనున్నారు.
కొలిక్కిరాని డ్యూటీల కేటాయింపు
ఆర్వోలు, ఏఆర్వోల డ్యూటీల కేటాయింపులు సోమవారం సాయంత్రం 6గంటల వరకు కొలిక్కిరా లేదు. ప్రధానంగా పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో ఆర్వోలు, ఏఆర్వోలుగా డ్యూటీలు వేసిన అధికారులకు మళ్లీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆర్వో, ఏఆర్వోల డ్యూటీల కేటాయింపు చేశారు. దాంతో వారంతా సోమవారం ప్రత్యేక శిక్షణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో వారిని తొలగించి కొత్త అధికారుల కోసం అన్వేషణ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆర్వోలు, ఏఆర్వోల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కలెక్టరేట్‌లో సోమవారం ఆర్వో, ఏఆర్వోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆర్వోలుగా పనిచేసిన వారికి మళ్లీ డ్యూటీలు వేయడంతో వారంతా హాజరుకాలేదు. శిక్షణ ఇవ్వకపోతే సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమై సామర్థ్యం వారికి ఉంటుందో లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా గ్రామీణ ఓటర్ల వివరాలు
రేపటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి శుక్రవారం వరకు చేపట్టనున్నారు. అయితే జెడ్పీటీసీ నామినేషన్లు తిరుపతిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో జెడ్పీ సీఈవో శోభనబాబు నేతృత్వంలో స్వీకరించనున్నారు. ఎంపీటీసీల నామినేషన్లు ఆయా మండలాల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలోనే స్వీకరించనున్నారు.
ఉదయం 10.30 నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరణ మొదలు కానుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 23వ తేదీ వరకు మాత్రమే నామినేషన్లకు గడువు ఉంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న స్క్రూట్నీ, 27న ఉపసంహరణతోపాటు పోటీలో ఉండే అభ్యర్థుల తుదిజాబితా వెల్లడించనున్నారు. నవంబర్ 3న ఎన్నికలు, 5వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
444 ఎంపీటీసీలకు ఎన్నికలు
ఎస్టీలకు– 36
ఎస్సీలకు– 116
బీసీలకు– 62
అన్ రిజర్వుడు–230
35 జెడ్పీటీసీలకు
ఎన్నికలు
ఎస్టీలకు– 03
ఎస్సీలకు– 10
బీసీలకు– 04
అన్ రిజర్వుడు–18
ఎస్టీ ఓటర్లు– 96,954
ఎస్సీ ఓటర్లు– 3,31,745
బీసీ ఓటర్లు– 4,84,345
అన్‌రిజర్వుడు–3,41,327
జిల్లా మొత్తం ఓటర్లు–12,54,371 మంది


