సాక్షి, టాస్క్‌ఫోర్స్: రేణిగుంట సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అధికార పార్టీ తిరుపతి నియోజకవర్గ పదవి పొందిన నాయకుడి పేరు ముసుగులో ‘మేము లోకల్.. చెప్పింది వినాలి..’ అంటూ హల్‌చల్ చేయడం కలకలం రేపుతోంది. ర్యాగింగ్ మాటున ఆ ముగ్గురి వ్యవహార తీరు కలవరపాటుకు గురిచేసింది. పై పెచ్చు వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోవడంతో విద్యార్థులు భయభయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా వారు కళాశాల వసతి గృహంలో ఉంటూనే కేటాయించిన గదిలో మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వసతి గృహ నిర్వాహకులు మందలించే ప్రయత్నం చేయగా.. వారు వినిపించుకోలేదు. ఆ తర్వాత కళాశాల యాజమాన్యం ఆ ముగ్గురికీ టీసీలు ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది.
గెంటివేసినా.. తప్పని బెడద
దాదాపు 1,600కు పైగా విద్యార్థులున్న ఆ కళాశాలలో ఆ ముగ్గుర్నీ గెంటేసినా వెలుపలి ప్రాంతం నుంచి వారి బెడద తప్పడం లేదు. అయితే ఆ ముగ్గురితో మిత్ర బంధం కలిగిన మరి కొందరు కళాశాలలోనే ఉంటున్నారు. వారి కోసం ఆ ముగ్గురూ తరచూ కళాశాల ముందు ఉన్న రోడ్డుపై బైకు విన్యాసాలతో అలజడి చేస్తుండడంతో బయట ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థినులు హడలిపోతున్నారు.
సర్టిఫికెట్ కోసం వెళితే బైండోవర్
రేణిగుంట: ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌కు వెళ్లితే బైండోవర్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన పోలీస్ క్లియరెన్స్ కోసం సోమవారం గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు కొంత సమయం వేచి ఉండాలని పక్కన పెట్టి, మండల టీడీపీ అధ్యక్షుడు స్టేషన్లోకి వెళ్లిన తర్వాత కొంత సమయం చర్చించారు. ఆ తర్వాత ఆయన సూచనల మేరకు పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రభాకర్‌ను బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లగా తహసీల్దార్ సోమ, మంగళవారాలు సెలవులున్నాయి.. బుధవారం తీసుకురావాలని ఫోన్లు సూచించడంతో మరళీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి బుధవారం రావాలని ప్రభాకర్‌ను ఆదేశించారు. దీనిపై స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.
రండి బాబూ...రండి
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతిలో విద్యార్థులను సర్వనాశనం చేసేందుకు టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నట్టుంది. వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రలోభపెట్టే ప్రయత్నం ముమ్మరం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వానికి టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతిపక్షాల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే మందిమార్బలాన్ని సన్నద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎస్వీయూలో పీజీ చేస్తున్న విద్యార్థులను బలిపుశువులను చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీకి చెందిన చోటా నాయకులు విద్యార్థులకు ఫోన్ చేసి రోజు రూ.600 కూలి ఇస్తాం.. బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేస్తామంటూ ఆశ చూపుతున్నారు. కేవలం నామినేషన్ వేసే కేంద్రాల వద్ద వేచి ఉండడమే పని అని ప్రలోభపెడుతున్నారు.
దారుణం
అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు డబ్బులు ఆశ చూపి నామినేషన్ ప్రక్రియను అడ్డుకోనే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ మండిపడ్డారు. వర్సిటీలో పలువురు విద్యార్థులకు అధికార పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేయడంతో ఎస్‌ఎఫ్‌ఐ దృష్టికి వారు తీసుకురావడం జరిగిందన్నారు.


