బ్రహ్మరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో కల్యాణ వెంకన్న నేడు చక్రస్నానం
తిరుపతి రూరల్: గోవింద నామస్మరణలు.. కర్పూర హారతులు.. భక్తజన సందోహం నడుమ తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా బ్రహ్మరథంపై కొలువుదీరిన స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
కల్కి అవతారంలో కల్యాణ వెంకన్న
రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణలు, కళాబృందాలతో పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వాహన సేవల్లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం
నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం మంగళవారం ఉదయం ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగిన వాహనసేవల్లో స్వామివారిని దర్శించుకోలేకపోయిన భక్తులు చక్రస్నానంలో పాల్గొంటే పుణ్యఫలం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు


