కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

● మహాసమాధిలో లీనమైన కల్కి భగవాన్‌ ● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● అధికార లాంఛనాలతో ముగిసిన కల్కి భగవాన్‌ అంత్యక్రియలు

వరదయ్యపాళెం: ఏకం వ్యవస్థాపకులు కల్కి భగవాన్‌ మహాసమాధి కార్యక్రమం శుక్రవారం ఏకం క్షేత్రంలో అశ్రునయనాల మధ్య ముగిసింది. వేలాది మంది భక్తుల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనాల అనంతరం శాస్త్రోక్తంగా మహాసమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రతువుతో ఏకం ఆధ్యాత్మిక క్షేత్రం శోకసంద్రంలో మునిగిపోయింది.

దుఃఖాన్ని దిగమింగి.. లాంఛనాలు పూర్తి చేసి

తండ్రి మరణవార్తను దిగమింగుకున్న కుమారుడు ముక్తి గురువు కృష్ణాజీ అంతిమ సంస్కారాలకు హాజరైన భక్తులకు అభివాదం చేస్తూ ముందుగా నిర్ణయించిన మేరకు అంతిమయాత్ర ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఏకం క్షేత్రంలో ఆలయం ముందు ఉంచిన కల్కి భగవాన్‌ పార్థివదేహాన్ని వేలాది మంది భక్తులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. శుక్రవారం మధ్యాహ్నం భగవాన్‌ శిష్యుల సమక్షంలో మహాసమాధికి అంతిమయాత్రను ప్రారంభించారు. అంతిమయాత్రకు తీసుకువచ్చిన ప్రత్యేక వాహనం ద్వారా మహాసమాధి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అంతిమయాత్రలో భగవాన్‌ తీసుకెళ్తున్న వాహనం ముందు ఆయన కుమారుడు కృష్ణాజీ, ప్రీతాజీ దంపతులతో పాటు ఆయన శిష్య బృందం వెళ్తుండగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు భగవాన్‌ను స్మరించుకుంటూ నినాదాలు సాగించారు. అనంతరం మహాసమాధి వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

హాజరైన ప్రముఖులు

కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు భగవాన్‌ పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం భగవాన్‌ తనయుడు కృష్ణాజీ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మహాసమాధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పుత్తూరు డీఎస్పీ మురళీధర్‌, శ్రీసిటీ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు, నాయుడుపేట డీఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆశ్రమ నిర్వాహకులు ఆచార్య ఆనందగిరిజీ, లోకేష్‌ దాసాజీ, సునీల్‌, లక్ష్మీ దాసాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అధికార లాంఛనాలతో..

అనుగ్రహ క్షేత్రంగా నిలుస్తుంది

ఒనెనెస్‌ ఉద్యమ సహ వ్యవస్థాపకులు కల్కిభగవాన్‌ కుమారుడు కృష్ణాజీ మాట్లాడుతూ, తన తండ్రి దేహాత్మ భావాన్ని ఎంతోకాలం క్రితమే అధిగమించారని తెలిపారు. అందువల్ల ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు నిర్వహించకుండా, ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం సమాధి చేయనున్నట్లు వివరించారు. ‘ఆయన సమాధి లక్షలాది మందికి అనుగ్రహాన్ని, ఆశీస్సులను ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది. భక్తులు అక్కడ ఆయన కరుణామయ సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ అనుభూతి చెందుతారు’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement