కూటమి పాలనలో రాష్ట్రానికి ప్రాజెక్టులు నిల్ వచ్చిన ప్రాజెక్టులను కమీషన్ల కక్కుర్తితో రద్దు చేస్తున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుచెబితే రాష్ట్రంలో ప్రాజెక్టులు పెట్టడానికి వచ్చే పెట్టుబడుదారులు పక్క రాష్ట్రాలకు పరార్ అయిపోతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును తీసుకొచ్చిన పాపానపోలేదన్నారు. అయితే తాము రాష్ట్రాన్ని జెడ్ స్పీడ్‌తో పరుగులు పెట్టిస్తూ రూ.7లక్షల కోట్లు పెట్టబడులు తీసుకొచ్చామని, అనేక పరిశ్రమలు వచ్చాయంటూ చంద్రబాబు, లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో వచ్చిన ప్రాజెక్టులను కూడా రద్దు చేస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలోని చింతలకుంట మఠంపల్లి వద్ద 2300మెగా వాట్స్ ఉత్పత్తికి రూ.10,300 కోట్ల పెట్టుబడితో 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి 2025 ఫిబ్రవరి 7న కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. అయితే ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు 2026 సెప్టెంబర్ 25న ఇంకో జీవో ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లాను టైగర్ జోన్ సెన్సిటివ్ పేరుతో ఆ ప్రాజెక్టును రద్దు చేయడం వెనుక ఏదో మతలబు, బలమైన కారణమేదో ఉందన్నారు. అలాగే నంద్యాల జిల్లా అవుకు వద్ద రూ.6వేల కోట్లతో 800 మెగా వాట్స్ కెపాసిటీతో ఆర్.వి.ఆర్. హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు 2025జూలై 28న అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఏ కారణం లేకుండా ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. అదే అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలి వద్ద నవయుగ కంపెనీ వాళ్లు 2,300 మెగావాట్స్ సామర్థ్యంతో పంప్‌డ్ మెగా హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని కారడవిలో నవయుగ కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టును మాత్రం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ చేతగాని తనం వల్ల రూ.3వేల కోట్లతో రాష్ట్రానికి రావాల్సిన టాటా సంస్థ వెస్ట్ బెంగాల్‌కు, వెబ్ సోల్ సంస్థ ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలకు పారిపోయాయని ఆరోపించారు. అల్లూరిసీతారామరాజు జిల్లాలోని దండకారణ్యంలో నవయుగ కపెనీకి ఇచ్చిన ప్రాజెక్టు ఎలా కొనసాగుతోందని, ఆర్.వి.ఆర్ ప్రాజెక్టు రద్దుకు గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కళ్లు తిరిగి పడిపోయావా? ..
కల్లుతాగి పడిపోయావా?
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పద్మ అనే మహిళ శ్రీవారి దర్శనార్థం వచ్చి క్యూలైన్లో కళ్లు తిరిగి పడిపోతే కళ్లు తిరిగి పడిపోయావా? కల్లుతాగి పడిపోయావా? అంటూ టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రశ్నించడంపై భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలో బీపీ, షుగర్ వ్యాధితో కళ్లు తిరిగి పడిపోయానని భక్తురాలు చెప్పిందన్నారు. అయితే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మందు తాగే అలవాటు ఉందా? కల్లు తాగకపోవడం వల్ల పడిపోయావా? అంటూ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


