పట్టాలెక్కని ఆపరేషన్ స్వర్ణ
శెట్టిపల్లె టౌన్‌షిప్ పేరుతో మాయ
అవిలాల చెరువు కథ మళ్లీ మొదటికి
కొత్తగా తెరపైకి రింగ్ రోడ్డు, లేక్ వ్యూ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
తుడాకి బడాయెక్కువైంది. అభివృద్ధి పేరుతో కొత్త విషయాలు తెరపైకి తేస్తూ.. వాటిని అమలు చేయడంలో చతికిల పడుతోంది. చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంతగా మారుతోంది. అలవిగాని హామీలిస్తూ ఫోజులు కొట్టడం అలవాటైపోతోంది. పబ్లిసిటీ పీక్ .. అభివృద్ధి వీక్ అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి తుడా: తుడా (తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ)కు అలివిగాని హామీలివ్వడం, అనక ఆ పనులను విస్మరించడం షరామామూలైపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకుండా పోయింది. తుడా చైర్మన్ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా ‘ఇది నేను చేశాను’ అని ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేందుక ఏమీ లేకుండా పోయింది. నాలుగైదు రోడ్లు మినహా చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో చేపట్టిన తుడా టవర్స్, శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారంలో కొంతమేర ముందుగు పడింది.
హంగామా తప్ప ఏమైనా ఉందా?
తుడా చైర్మన్‌గా దివాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మాయదారి మాటలు తప్ప చేసింది ఏమీ లేదు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం తీసుకువచ్చిన హైడ్రాను కాపీ కొట్టి ఆపరేషన్ స్వర్ణ చేపడుతున్నట్లు ప్రకటించా రు. స్వర్ణముఖి నది పరిరక్షణకు చంద్రబాబు కంకణ బద్ధులయ్యారని జబ్బలు చరిచారు. తిరుచానూరు వద్ద పద్మావతి ఘాట్ నిర్మిస్తున్నట్లు ఊదరగొట్టారు. ఇందుకు సంబంధించి నేటికీ అడుగు పడలేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఆపరేషన్ స్వర్ణ కనుమరుగైంది. శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్ ప్రకటన కాగితాలకే పరిమితమైంది. తుడా టవర్స్ పనులను రెండేళ్లుగా సాగదీస్తూనే ఉన్నారు.
శెట్టిపల్లె క్రెడిట్ కొట్టేందుకు యత్నం
శెట్టిపల్లె సమస్యకు పరిష్కారం చూపుతూ గత ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఈ సమస్యకు సవాల్‌గా మారిన రైతులను ఒప్పించడం, లీగల్ సమస్యలను అధిగమించేందుకు నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లారు. ఆపై ప్రభుత్వ ఉత్తర్వులు పొంది ఎన్నికల ముందు రైతులు, ప్లాట్స్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అంతలో ఎన్నికల కోడ్ రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ప్రక్రియ పూర్తి చేశాక ఇటీవల తుడా రిజిస్ట్రేషన్లు మాత్రమే చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటివరకు ప్లాట్స్ వేసింది గాని, ప్లాట్ చూపించింది గాని, ఒక్క రోడ్డు అభివృద్ధి చేసింది గానీ లేదు. శెట్టపల్లి సమస్యను తామే పరిష్కరించామంటూ క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం తప్ప ఇప్పట్లో శెట్టిపల్లె వెంచర్లు అభివృద్ధి అయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. కొత్తగా తుడా టౌన్‌షిప్ అంటూ మాయ మాటలు చెబుతున్నారు.
జీతాలకే దిక్కులేదు..
గత ఏడాది తుడా వార్షిక ఆదాయం రూ.68 కోట్లు. ఇందులో ఉద్యోగుల జీతాలు, తదితర ఖర్చులు రూ.80 కోట్లు వరకు ఉంటుంది. ఈ క్రమంలో తుడా ఆదాయానికి మించి చేస్తున్న ప్రకటనలు బడాయి మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదనే చర్చ సాగుతోంది.
తిరుపతి తుడా కార్యాలయం
అలివిగాని హామీలతో హంగామా
కొత్తగా తెరపైకి రింగ్ రోడ్
తుడా ఇటీవల అనేక కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెస్తోంది. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పటి చైర్మన్ నరసింహయాదవ్ వైకుంఠ మాల పేరుతో తిరుపతికి చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అది ప్రకటనకే పరిమితమైంది. ఇప్పుడు చంద్రగిరి, రామచంద్రాపురం, వడమలపేట, రేణిగుంట ప్రాంతాలను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మిస్తామంటూ తుడా ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. భూ సేకరణ, నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లకుపైగా వెచ్చించాల్సి ఉంటుంది. మరి తుడాకు అంత సీన్ ఉందా..? అన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తిరుపతి, పరిసర ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి, వర్షపునీటి పరిరక్షణకు నడుం బిగిస్తున్నట్లు ఇటీవల ఫొటోలకు ఫోజులిచ్చారు. అలాగే నాలుగు రోజుల క్రితం శెట్టిపల్లె భూముల్లో 50 వేల మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అవిలాల చెరువు అభివృద్ధి టెండర్ దశను దాటడం లేదు. అలానే మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు, వెంచర్లు వేయాలని తుడా భావిస్తోంది. కాగా తుడా ఆదాయం ఎంత.. అభివృద్ధికి రూపొందిస్తున్న ప్లాన్‌లకు అయ్యే ఖర్చు ఎంత.. అన్న చర్చ జరుగుతోంది. హామీలు అమలు చేయాలంటే కనీసం రూ.500 కోట్లు అవసరం. తుడా చైర్మన్ కాల పరిమితి మరో ఆరు నెలల్లో ముగియనుంది. అంతలోపు ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టునైనా పట్టాలెక్కిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.


