తిరుపతి సిటీ: నీట్ లీక్ వ్యవహారంలో ఎన్‌టీఏని రద్దు చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర పదాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని విద్యార్థి, ప్రజా, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. నగరంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రధాన ద్వారం నుంచి ర్యాలీగా బయలు దేరిన నేతలు పలు విద్యా సంస్థలను సందర్శించి తరగతులను బహిష్కరించాలని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీట్ లీకేజ్‌కి కారణమైన కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 24 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. 2014 నుంచి దేశంలో 152 పేపర్లు లీక్ కావడం దారుణమన్నారు.
మద్దతు పలికిన ప్రైవేటు విద్యాసంస్థలు
నేతల పిలుపు మేరకు శుక్రవారం తిరుపతి జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. ఈ మేరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యథావిధిగా సాగింది.
యూనివర్సిటీలపై కన్నెర్ర
బంద్‌కు పిలుపు నిచ్చినా ఎస్వీయూ, సంస్కృత వర్సిటీ, మహిళా వర్సిటీలు స్పందించకుండా తరగతులను కొనసాగించడంపై విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు కన్నెర్ర చేశారు. వర్సిటీలలో నడుస్తున్న తరగతులను బహిష్కరించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వర్సిటీ గేట్లు వేసి విద్యార్థి సంఘాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనుకాడకుండా గేట్లు పైకి ఎక్కి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జయచంద్ర, అక్బర్, ప్రవీణ్, లోకేష్, మల్లికార్జున, వీరేష్, సాయిలక్ష్మి, చిన్న, ఐరాల లోకేష్, పవిత్ర, రామకృష్ణ, అశోక్, వినోద్, శివబాలాజీ పాల్గొన్నారు.


