నంది విద్య నటేశ్వరితో.. సంస్కార విలువల పెంపు! | - | Sakshi
Sakshi News home page

నంది విద్య నటేశ్వరితో.. సంస్కార విలువల పెంపు!

Jul 25 2026 12:17 AM | Updated on Jul 25 2026 12:17 AM

● వర్చువల్‌గా శ్రీవిజయేంద్రసరస్వతి అనుగ్రహ భాషణం ● హాజరైన టీటీడీ ఈవో, జేఈఓ

తిరుపతి రూరల్‌: టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్‌, శ్రీకంచీ కామకోటి పీఠం సంయుక్తంగా చేపట్టిన శ్రీనంది విద్య నటేశ్వరిశ్రీ కార్యక్రమం విద్యార్థుల్లో సంస్కారవంతమైన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్‌ ద్వారా అనుగ్రహ భాషణం చేశారు.

వంద పాఠశాలల్లో విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వంద పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. విద్యార్థుల్లో కళాభిరుచి, క్రమశిక్షణ, సంస్కార విలువలను పెంపొందించేందుకు మృదంగం, భారతీయ నృత్య కళల సమ్మేళనంగా దీనిని రూపొందించామన్నారు. 2025 డిసెంబర్‌లో మొదటగా 50 పాఠశాలల్లో ప్రారంభంచి, ఈ ఏడాది వంద పాఠశాలలకు విస్తరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు టీటీడీ విద్యాసంస్థలు పాల్గొనగా, తిరుపతి పరిసర ప్రాంత పాఠశాలలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్లు వివరించారు.

ప్రముఖ కళాకారులకు సన్మానం

ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మవిభూషణ్‌ డా.ఉమయాళ్‌పురం కె.శివరామన్‌, ప్రముఖ భరతనాట్య కళాకారిణి రేవతి రామ్మోహన్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో ఏ.శరత్‌ ఘనంగా సత్కరించారు. అనంతరం వారు అందించిన కళాప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చివరగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన అష్టలక్ష్మి వైభవం నృత్యరూపకం అలరించింది.

లలిత సహస్రనామం నుంచి నందివిద్య నటేశ్వరి

నందివిద్య నటేశ్వరి అనే పేరు శ్రీలలిత సహస్రనామంలోని 733, 734 నామాల నుంచి ఆవిర్భవించిందని స్వామివారు తెలిపారు. జూలై 23న ఏకకాలంలో 100 వేదికలపై నిర్వహించిన కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. టీటీడీ ఆర్థిక సహకారంతో పాటు శ్రీవారి సుప్రభాతం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను విద్యార్థులకు పుస్తక ప్రసాదంగా ఉచితంగా అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement