తిరుపతి సిటీ : ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని తాత్కాలిక బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టరేట్ ముట్టడి కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తాత్కాలిక బోధనేతర సిబ్బంది క్రమబద్ధీకరణతోపాటు రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భద్రతా ప్రయోజనాలు అందించాలని కోరారు. నేతలు సుబ్బరాయుడు, గోపి, సురేష్, శ్రీనివాసులు, శ్రీహరి, శైలజ, సునీత పాల్గొన్నారు.


