దౌర్జన్య‘కూటమి’ | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్య‘కూటమి’

Jul 25 2026 12:17 AM | Updated on Jul 25 2026 12:17 AM

● కూటమి ప్రభుత్వంలో పెచ్చుమీరుతున్న దాడులు, దౌర్జన్యాలు ● పట్టించుకోవాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారు ● పార్టీలో క్రమశిక్షణ పాటించని వారిపై వేటు ● నేదురుమల్లి ఘాటు వ్యాఖ్యలు

వెంకటగిరి(సైదాపురం): ‘వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు శ్రుతి మించిపోతున్నాయి.. వాటిని పట్టించుకోవాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారు...’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక నేదురుమల్లి కార్యాలయంలోని ఎన్‌జేఆర్‌ భవనంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాత్రీపగలు తేడాలేకుండా ఇసుక, మట్టి అక్రమ రవాణా సాగుతోందన్నారు. వెంకటగిరి పట్టణంలో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను సైతం కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే చోద్యం చూస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా జరిగిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రూ.40లక్షల మేర బిల్లులు మంజూరు చేసి టీడీపీ నేతలకు పంచిపెట్టిందని ఆరోపించారు. ఇందులో టీడీపీ, జనసేన నేతల మధ్య వార్‌ కూడా నడుస్తోందన్నారు.

క్రమశిక్షణ చర్యలు తప్పవు

వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు కొందరు కార్యకర్తలు, నేతలు హాజరు కావడం లేదని, ఇలాంటివారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని నేదురుమల్లి హెచ్చరించారు. అఽధికార పార్టీ ప్రజాప్రతినిధులతో దైవదర్శనాలకు వెళ్లడం, పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేయడం లాంటి విషయాలు తమ దృష్టికి వచ్చాయని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపీగా వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. మూడు రోజుల్లోనే ఐదు వేల మందికి పైగా సంతకాలు చేశారన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, వెందోటి కార్తీక్‌రెడ్డి, మన్నారపు రవికుమార్‌యాదవ్‌, శ్రీనివాసులురెడ్డి, యోగిరాజు, మోహన్‌రావు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement