నిద్రమత్తులో అటవీశాఖ
తైలం చెట్ల పెంపకంపై మొగ్గు
ఆందోళన చెందుతున్న స్థానికులు
జీడీ తోటలు మాయం
సత్యవేడు మండలం వానెల్లూరు
ప్రాంతంలో ఉన్న జీడిమామిడి తోట
ఒకప్పుడు సత్యవేడు పేరు వింటేనే గుబాళించే జీడిమామిడి సువాసనలు... నాణ్యమైన దిగుబడులతో పచ్చని పసిడి పంటగా విరబూసిన ఆ తోటలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వేలాది ఎకరాల్లో కళకళలాడిన జీడిమామిడి వనాలు నేడు ఉనికికే పరీక్షగా మారి కనుమరుగవుతుంటే, సంబంధిత అటవీ శాఖ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. తోటల పునరుద్ధరణపై కనీస శ్రద్ధ చూపకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవనోపాధి కోల్పోయిన కూలీలు ఆవేదనతో లబోదిబోమంటున్నా అటవీ అధికారుల పట్టింపులేనితనం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
వరదయ్యపాళెం: సత్యవేడు, వరదయ్యపాళెం పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు జీడిమామిడి తోటలు విరివిగా ఉండేవి. సీజన్‌లో ఈ తోటల ద్వారా వచ్చే జీడిమామిడి పండ్లు చైన్నె, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలోని పండ్ల మార్కెట్లకు పెద్దఎత్తున వెళ్లేవి. అంతేకాక పండ్లతో పాటు వచ్చే జీడిపప్పు గింజలకు గిరాకీ ఉండేది. తద్వారా బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఎగబడి మరీ జీడిమామిడి గింజలను కొనుగోలు చేసేవారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన జీడిమామిడి పంట నేడు సత్యవేడు ప్రాంతంలో అంతరించిపోయింది.
1975 నుంచి జీడిమామిడి పంట సాగు:
సత్యవేడు డివిజన్ అటవీ అభివద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో 1975 నుంచి జీడిమామిడి పంట 5400 హెక్టార్లలో సాగయ్యేది. అడవికండ్రిగ, అరుదూరు, రాచర్ల, చిలమత్తూరు, వానెల్లూరు, కొత్తమారికుప్పం, అంజూరు, ఆంబాకం, టీపీపాళెం, రాజులకండ్రిగ, రాజుగుంట, సత్యవేడు, ఓబులరాజుకండ్రిగ, కాంబాకం, బత్తవల్లం ప్రాంతాల్లో జీడిమామిడి తోటలు సాగయ్యేవి. ప్రస్తుతం కొత్తమారికుప్పం, రాజులకండ్రిగ, రాజుగుంట, బత్తలవల్లం, కాంబాకం గ్రామాలకే పరిమితమయ్యాయి. ఈ తోటలను అధికారులు పర్యవేక్షించేవారు. కాపు వచ్చే సమయంలో బహిరంగ వేలం ద్వారా రైతులు, వ్యాపారులకు పంటను అప్పగించేవారు. ఏడాదికి రూ.కోటికి పైగా ఏపీఎఫ్‌డీసీకి ఆదాయం వచ్చేది. కూలీలకు సైతం చేతినిండా పని లభించేది. తర్వాత అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో తోటల నిర్వహణ భారంగా మారింది. ప్రస్తుతం ఈ పంట సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో 500 హెక్టార్లకే పరిమితమైంది. మిగిలిన చోట్ల జీడిమామిడి తోటలకు బదులు తైలం తోటలను సాగు చేస్తున్నారు.
అటవీశాఖ అశ్రద్ధ
జీడిమామిడి తోటలు అంతరించిపోవడానికి అటవీశాఖ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో తోటల నిర్వహణపై అటవీ సిబ్బంది సరైన శ్రద్ధ చూపలేదని వాపోతున్నారు. ఈ పంట ద్వారా ఏడాదిలో 5 నెలలు వేలాది మందికి ఉపాధి లభించేది. తైలం చెట్ల పెంపకం ద్వారా ఉపాధి సైతం కోల్పోయామని కూలీలు ఆందోళన చెందుతున్నారు.
సత్యవేడులో అంతరిస్తున్న జీడి మామిడి తోటలు
అంచెలంచెలుగా తొలగింపు
తోటల నుంచి దిగుబడి తగ్గుముఖం పట్టడం, ఆశించిన స్థాయిలో పంట రాకపోవడం తదితర కారణాలతో 1997 నుంచి పంటల తొలగింపును అంచెలంచెలుగా చేపట్టారు. వాటి స్థానంలో యూకలిప్టస్, క్లోన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. జీడి మామిడి తోటలను తొలగించడంతో కూలీలకు ఉపాధి కరువైంది.


