తిరుపతి సిటీ: బాబో ఇదేమి కాంపిటేషన్...టీటీడీ చరిత్రలో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ స్థాయి పోటీని చూడలేదంటూ కళాశాల అధికారులు, అధ్యాపకులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. టీటీడీ జూనియర్ కళాశాలల్లో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను టీటీడీ విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎంపికై న విద్యార్థుల సెల్‌ఫోన్లకు ఆదివారం మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. సీటు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో తమకు కేటాయించిన కళాశాలలో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న మూడు రోజుల కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. తొలివిడత కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత రెండో విడత కౌన్సెలింగ్ కోసం మెరిట్ లిస్ట్‌ను అధికారులు రూపొందించనున్నారు.
96.90శాతానికి ఆగిన మెరిట్ లిస్ట్
పద్మావతి జూనియర్ కళాశాలలో బైపీసీ, ఎంపీసీ కోర్సులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. తొలివిడత మెరిట్ లిస్ట్‌లో జనరల్ ఓసీ కేటగిరీకి 96.90శాతం మార్కులు వద్ద తొలి దశ సీట్ల కేటాయింపు ముగిసిందంటే పోటీ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సులకు సైతం 86 శాతం వద్ద ఆగినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్వీ జూనియర్ కళాశాలలో సైతం ఓసీ జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లకు 93 శాతం వద్ద తొలి దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ముగిసింది. ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులకు 84 శాతం మార్కులు వరకు సీట్లు కేటాయించారు.


