తిరుపతి అన్నమయ్యసర్కిల్: నాగలాపురం శ్రీవేదవల్లి సమేత వేదనారాయణస్వామి వార్షిక సూర్యపూజ మహోత్సవం మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు జరుగనుంది. ఈ మేరకు శనివారం టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పించనున్నారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం రూపంలో సంవత్సరాల కొలది యుద్ధం చేసి వచ్చినందున, స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలోని మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపైన, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.
16 నుంచి ఎంటెక్ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఎంటెక్ ఫస్ట్, థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశామని, ఈనెల 28వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు విద్యార్థులు పరీక్షల ఫీజును ఈనెల 11వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ:శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో గత నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాల ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి నారాయణమ్మ శనివారం విడుదల చేశారు. టీటీడీ అధికారుల ఆదేశాల మేరకు అటానమస్ హోదాలో 20 రోజుల్లోనే విడుదల చేశామని చెప్పారు. పరీక్షల్లో 90.2 శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణతను సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, ఎగ్జామినేషన్ మెంబెర్స్ జి సుధాకర, చంద్రశేఖర్, లక్ష్మయ్య, వినోద్ బాబు (జియో), అధ్యాపకులు పాల్గొన్నారు.


