పులికాట్‌లో సరిహద్దులు చూపండి
తిరుపతి అర్బన్: పులికాట్ సరస్సులో సరిహద్దు చూపాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఆ మేరకు మంగళవారం వంద మందికిపైగా మత్స్యకారులు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని, నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు మత్స్యకారులు రోజురోజుకు మన జలభాగంలోని చొరబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని వాపోయారు. అంతేకాకుండా తమిళనాడు పోలీసులతో తిరుపతి జిల్లా మత్స్యకారులపై ఇప్పటికే 197 క్రిమినల్ కేసులు పెట్టించాలని కన్నీరుపెట్టుకున్నారు. జిల్లాలో 17 గ్రామాల్లోని 15వేల మంది పూర్తిగా చేపల వేట ఆధారంగా జాలర్ల జీవనం సాగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలవాలని ఆయన సీసీలను సంప్రదించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్‌కు మీటింగ్‌లు ఉన్నాయని, ఆ తర్వాత నలురుగు వ్యక్తులకు మాత్రమే కలవడానికి అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో మత్స్యకారులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే ఎంపీ మద్దిల గురుమూర్తి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌తో మాట్లాడారు. అయితే ఆయన జూమ్ మీటింగ్‌లో ఉండడంతో ఆ కార్యక్రమం ముగిసిన సమావేశం ఏర్పాటు చేయించారు. మీటింగ్ హాల్‌కు కలెక్టర్ చేరుకుని మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు.
సంప్రదింపులు జరిపాం
కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌తో సంప్రదింపులు జరిపామని, ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల సన్నాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ అంశంపై సోమవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టరుతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి నలుగురు మత్స్యకారులు మీటింగ్‌కు హాజరైతే మీ సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ప్రస్తావించా
ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ తమిళనాడు జాలర్లకు తిరుపతి జాలర్లకు మధ్య ఉన్న సరిహద్దు వివాదాలపై ఇప్పటికే పలుసార్లు పార్లమెంట్‌లో ప్రస్తావించానని వెల్లడించారు. మరోసారి ఈ అంశాన్ని గట్టిగా పార్లమెంట్‌లో తెలియజేస్తామని స్పష్టం చేశారు. అలాగే కేంద్రహోం మంత్రి అమిత్‌షా దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోతామని వివరించారు.
పులికాట్‌లో సరిహద్దులు చూపండి


