శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 60,764 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,077 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
ఆర్టీసీ దుకాణాలకు టెండర్లు
తిరుపతి అర్బన్: జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల పరిధిలో ఖాళీగా ఉన్న 60 దుకాణాలు అద్దెకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ జగదీష్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం నుంచి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదే రోజు ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసిన దరఖాస్తులను డీపీటీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్‌లో వేయాలని స్పష్టం చేశారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేసి దుకాణాలు కేటాయించనున్నట్లు ఆయన వివరించారు.
ఎస్వీ వెటర్నరీలో
ఘనంగా కిసాన్ దివస్
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మంగళవారం కిసాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ డాక్టర్ జేవీ.రమణ మాట్లాడుతూ భారతదేశ ఐదో ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది కిసాన్ దివస్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వ్యవసాయ దాని అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, ఆహార భద్రతను మరింతగా ప్రోత్సహించారన్నారు. పశు ఉత్పత్తుల ద్వా రా పేత రైతులకు జీవనోపాధి, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నారు. అనంతరం పశుపోషణ, పాల ఉత్పత్తిలో విశేష ప్రతిభను కనబరిచిన ఇద్దరు మహిళా పాడి రైతులను వీసీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ సైన్స్ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు, పశువైద్య శాస్త్ర డీన్ డాక్టర్ సురేష్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శ్రీలత, డీన్ ఆఫ్ స్టూడెంట్ డాక్టర్ వైకుంఠరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆదిలక్ష్మమ్మ, డెయిరీ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డాక్టర్ గంగరాజు, పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తదితరులు పాల్గొన్నారు.


