టెట్ మూడో రోజూ ప్రశాంతం
తిరుపతి సిటీ: జిల్లాలో మూడో రోజు టెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలు, చైన్నెలోని మూడు పరీక్ష కేంద్రాలో ఉదయం మొదటి సెషన్‌కు 1,784 మంది హాజరుకావాల్సి ఉండగా, 1,666మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 1,655 మంది హాజరు కావాల్సి ఉండగా 1,450 మంది హాజరైనట్లు తెలిపారు.
దుబాయ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: దుబాయ్‌లో జనరల్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి లోకనాథం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓఎంసీఏపీ, వరల్డ్ పీపుల్ సొల్యూషన్స్ సంస్థల సహకారంతో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్హత పదో తరగతి, వయస్సు 21–37 వరకు ఉండాలని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ ఫీజు రూ.30 వేలతోపాటు జీఎస్టీ ఉంటుందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని చెప్పారు. అదనపు సమాచారం కోసం 91609 12 690, 99888 53335, 871265 5686, 879011 8349నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ప్రశాంతంగా నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష
తిరుపతి సిటీ: జిల్లాలో 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 2,060 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 1,212 మంది విద్యార్థులు హాజరయ్యారని, 848 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ జట్టులో తిరుపతి జిల్లా క్రీడాకారిణికి స్థానం
తిరుపతి ఎడ్యుకేషన్ : గోల్ షాట్‌బాల్ భారత జట్టులో తిరుపతి జిల్లా నెరబైలుకు చెందిన క్రీడాకారిణి రెడ్డిచర్ల దేవీప్రియ చోటు సాధించారు. గత నెల 15వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించిన గోల్ షాట్‌బాల్ భారత జట్టు ఎంపిక పోటీల్లో సీ్త్రల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు నేపాల్ దేశం ఖాట్మాండులో నిర్వహించనున్న దక్షిణాసియా అంతర్జాతీయ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టులో ఈమె ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్ర, పుణెలో నిర్వహిస్తున్న భారత జట్టు ప్రాక్టీస్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె 2010 నుంచి ఇప్పటివరకు హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, షూటింగ్‌బాల్ తదితర క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. తొలిసారిగా భారత జట్టులో స్థానం సాధించిన ఆమెను గోల్ షాట్‌బాల్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.మురళి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


