నేటి నుంచి ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్
ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు
ఏర్పేడు: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(ఐఐటీ) 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ వెల్లడించారు. 8 రోజులపాటు తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ఐఐటీల నుంచి విద్యార్థులు ఇప్పటికే తిరుపతి ఐఐటీకి చేరుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తిరుపతి ఐఐటీతోపాటు మద్రాస్, హైదరాబాద్ ఐఐటీల్లోనూ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏర్పేడు సమీపంలో ఉన్న తిరుపతి ఐఐటీ ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా ప్రాంగణం వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం ఐఐటీలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ రెజ్లర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి 5వేల మందికి పైగా విద్యార్థులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు ఈనెల 21వ తేదీతో ముగియనున్నాయి. తిరుపతి ఐఐటీ వేదికగా చెస్(మిక్స్‌డ్), టెన్నిస(పురుషులు, మహిళలు), వెయిట్ లిప్టింగ్(పురుషులు) పోటీలు జరగనున్నాయి.


