
వింగ్ టెక్ ఉద్యోగుల బైఠాయింపు
రేణిగుంట: మీ ఉద్యోగాలు మీకు ఇస్తామని పరిశ్రమ యాజమాన్యం నమ్మించి మోసం చేసిందని యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరుతూ 205 మంది ఉద్యోగులు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఈఎంసీ–2 క్లస్టర్‌కు చెందిన వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీకి చెందిన 205 మంది ఉద్యోగులు సోమవారం ఉదయం కంపెనీ ప్రధాన ద్వారానికి ఎదురుగా బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ సుధాకర్ చేరుకుని ఉద్యోగులతో చర్చించారు. చర్చల అనంతరం ఉద్యోగులు ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమను మోసం చేశారంటూ వింగ్ టెక్, లెక్చర్ కంపెనీల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఉద్యోగులు తిరుపతి కలెక్టరేట్ చేరుకుని పీజీఆర్‌ఎస్‌లో తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఉద్యోగులకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.