
తుడా చైర్మన్ చాంబర్ వద్ద శెట్టిపల్లె బాధితుల ఆందోళన
తిరుపతి తుడా: శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు సోమవారం మంత్రి నారాయణ సమావేశం నిర్వహిస్తున్న తుడా చైర్మన్ చాంబర్‌ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శుభం భన్సల్ శెట్టిపల్లె భూ బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. భూ సమస్యను పరిష్కరించేందుకు తాము ప్రభుత్వానికి నివేదికలు పంపామని, మూడు నెలల్లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తానని దివాకర్ రెడ్డి హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు.
తెరపైకి స్కావెంజర్స్ కాలనీ వ్యవహారం
తిరుపతి స్కావెంజర్స్ కాలనీలోని అందరూ సహకరిస్తే స్థలాన్ని ఖాళీ చేయించి బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని కట్టించి ఇస్తానని మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో చెప్పారు. గతంలోనూ ఈ ప్రతిపాదన చేశామని, అయితే కొందరు ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు . తాను తాటాకుల గుడిసెలోనే చదువుకుని, ట్యూషన్లు చెప్పుకుని ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. గుడిసెల్లో ఉండే బాధలు తనకు తెలుసు కాబట్టి అందరూ సహకరిస్తే మంచి బహుళ అంతస్తుల భవనాన్ని కట్టించి బాధితులు అందరికీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.