
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
తిరుపతి తుడా: ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పీ నారాయణ అన్నారు. సోమ వారం తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ ,తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్షించారు. తుడా టవర్స్, ప్లాట్స్, దుకాణాలపై వచ్చే అదాయ, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి, వీసీ, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ ఎన్ మౌర్య వివరించారు. మంత్రి మాట్లాడుతూ టౌన్ షిప్‌లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరలో శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని, నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్లను వినియోగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణారెడ్డి, శ్యాంసుందర్ పాల్గొన్నారు.