
ఐఐటీ విద్యార్థులకు ఇంటరాక్టివ్ సెషన్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల విభాగం సంయుక్తంగా గుజరాత్‌లోని వడోదర ఎంపీ డాక్టర్ హేమాంగ్ జోషితో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీపై విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ప్రజాస్వామ్యం, పాలన, ప్రజా విధానం డైనమిక్స్‌పై చర్చలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, విధాన ఔత్సాహికులకు సూచనలు ఇచ్చారు. ఐఐటీ డైరెక్టర్–ఇన్–చార్జ్ ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా పాల్గొని యువతకు సాధికారత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిందని కొనియాడారు.
రెండు బైక్‌లు ఢీ : ఒకరి మృతి
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై చిల్లకూరు సమీపంలో ఆదివారం రాత్రి రెండు మోటారుబైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన చమర్తి కృష్ణయ్య(39) మృతి చెందగా, కోటకు చెందిన చీరా రోశయ్య గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మోహనమ్మ, కుమార్తెలు చంద్రలేఖ, ప్రవీణ, కుమారుడు శ్రీనాథ్ ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
తిరుపతి క్రైమ్ : వ్యవసాయ, పోలీస్ శాఖ సమన్వయంతో ఆదివారం తిరుపతిలోని ఎరువుల షాపులపై దాడులు నిర్వహించారు. యూరియా, నానో యూరియా నిల్వలను తనిఖీ చేశారు. రైతులకు నాన్ యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా ఎకరానికి అర లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే సాధారణ యూరియాతో పోల్చుకుంటే అధిక శాతం నత్రజని పంటకు లభిస్తుందని, డీలర్లు, రైతులకు అవగాహన కల్పించారు. 45 కేజీల యూరియా బస్తా అర లీటర్ నానో యూరియాతో సమానమని వెల్లడించారు. తనిఖీల్లో ఈస్ట్ సిఐ శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.