
నాలుగు ఆవులు మృతి
పెళ్లకూరు : మండలంలోని పాలచ్చూరు గ్రామంలో రామ్‌కో ఎన్విరో ఇంజినీరింగ్ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలను తాగడంతో ఆదివారం నాలుగు ఆవులు మృత్యువాత పడ్డాయి. రామ్‌కో ఎన్విరో ఇంజినీరింగ్ పరిశ్రమ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యర్థ జలాలు వదిలేస్తున్నారు. అటుగా వెళ్లిన మూగజీవాలు వ్యర్థ జలాలను తాగి మృతి చెందుతున్నాయి. బాధితులు కాటూరు గోవర్ధన్, బట్టా వెంకటసుబ్బయ్య, బట్టా రమేష్ మాట్లాడుతూ తమ ఆవులు మరణించడంతో రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
అనారోగ్యంతో జీవితఖైదీ..
తిరుపతి క్రైం: అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి చెందిన ఘటన ఆదివారం స్విమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వెస్ట్ సీఐ మురళీమోహన్ కథనం.. నెల్లూరులోని మైపాడుకు చెందిన షేక్‌కాలేశా(64) ఓ వ్యక్తిని హత్య చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండడంతో నెల్లూరు జైలు పోలీసులు సిమ్స్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ షేక్‌కాలేశా మృతి చెందాడు.
29న పోలీస్ సమన్వయ కమిటీ సమావేశం
తిరుపతి క్రైం: తిరుపతిలో ఈనెల 29వ తేదీన దక్షిణాది ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ సమావేశం తాజ్ హోటల్‌లో జరగనుంది. ప్రధాని ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలైన ఎనిమిది మంది డీజీపీలు సమావేశం కానున్నారు. ఇందులో కీలకమైన పోలీసింగ్ అంశాలపై, అంతర్రాష్ట్ర సహకార సమన్వయ బలోపేతం పై చర్చించునున్నారు.