
క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యం
తిరుపతి సిటీ : రాష్ట్రంలో క్రీడలను ప్రొత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, తెలిపారు. ఆదివారం తిరుపతి తారకరామా స్టేడియంలో అమరావతి చాంపియన్ షిప్–2025 రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులను క్రీడలవైపు ప్రొత్సహించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. జిల్లా నుంచి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమన్నారు. తిరుపతిలో క్రీడారంగం అభివృద్ధికి 30ఎకరాలు కేటాయించామని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మించనున్నట్లు వివరించారు. మెగా డీఎస్సీతో సుమారు 450 అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. అమరావతి చాంపియన్ షిప్‌లో ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హాకీ , కబడ్డీ, ఖోఖో, షటిల్ తదితర క్రీడలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ ఎండీ గిరీష్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి, సినీ నటుడు నారా రోహిత్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, జాతీయ స్థాయి క్రీడాకారిణి రజని, డీఎస్‌సీఓ శశిధర్ పాల్గొన్నారు.