
తుమ్మలగుంటలో తుంబుర గణపతి
10 అడుగుల ఎత్తు,7 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న చెవిరెడ్డి కుటుంబీకులు
తిరుపతి రూరల్ : వినాయకచవితి పర్వదినం వస్తోందంటే చాలు.. అందరి కళ్లు తుమ్మలగుంట వైపు చూస్తుంటాయి. గత పాతికేళ్లుగా చెవిరెడ్డి కుటుంబీకులు విభిన్న ఆకృతులతో గణపతి ప్రతిమను తయారు చేయించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే 10 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో తుంబుర వినాయకుడి ప్రతిమను సిద్ధం చేయిస్తున్నారు. పరమేశ్వరుని ఒడిలో కూర్చుని తుంబుర చేతబట్టుకుని ధ్యానం చేస్తున్నట్టుగా గణేశుడి విగ్రహం కొలువుదీరనుంది. పర్యావరణ హితంగా చిట్టి, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 10 మంది కార్మికులు నాలుగు రోజులుగా శ్రమించి ప్రతిమను తీర్చిదిద్దారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీ ఉదయం కల్యాణ వెంకన్న ఆలయంలోని కల్యాణ మండపంలో గణపతిని కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.