
ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స
పుట్టుకతోనే షుగర్ వ్యాధి బారీన పడుతున్న వైనం జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న టైప్–1 రోగులు వంశపారంపర్యం, ఇన్ఫెక్షన్లు , వైరల్ వ్యాధులే కారణమంటున్న నిపుణులు ఇన్సులిన్ తీసుకోవడమే శరణ్యమంటున్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేధిస్తున్న ఇన్సులిన్ కొరత
కోవిడ్ తర్వాత టైప్–1 డయాబెటీస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఈ వ్యాధి గ్రస్తులు కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే ఉండేది. ఇప్పడు అది 10 నుంచి 15శాతానికి పెరిగింది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. చిన్నారుల్లో వచ్చే టైప్–1 మధుమేహం ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతుల లక్షణాలతో చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువస్తుంటారు. పరీక్షల నిర్వహించి డయాబెటీస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. వ్యాధి భారిన పడిన పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియమావళి తప్పనిసరిగా పాటించాలి.–డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి,
చిన్నపిల్లల వైద్య నిపుణుడు, తిరుపతి
●
తిరుపతి తుడా : జిల్లాలో టైప్–2 డయాబెటీస్‌తో పోటీపడుతూ టైప్–1 డయాబెటీస్ వెంటాడుతోంది. పుట్టకతోనే సంక్రమిస్తూ వేల మంది చిన్నారుల జీవితాలతో ఆడుకుంటోంది. శరీరంలోని క్లోమ గ్రంధిలో ఇన్సులిన్ హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాలతో ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలను శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1గా మధుమేహంగా పిలుస్తారు. సాధారణంగా పిల్లలు, యువతలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కొన్ని సార్లు బీటా కణాలను రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు, గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యమవుతాయి. దీని బారీన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. మరికొంత మందికి పలు రకాల ఇన్ఫెక్షన్లు, వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటీస్‌కు కారణాలు కావు.
30 శాతం బాధితులే
జిల్లాలో కోవిడ్ తర్వాత టైప్–1 మధుమేహం విజృంభణ ఎక్కువైంది. జిల్లాలో 30 శాతం మధుమేహ బాధితులు ఉండటం గమనార్హం. ఇందులో టైప్–2 డయాబెటిక్ బాధితులు 90శాతం ఉండగా టైప్–1 బాధితులు 15శాతం ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన టైప్–1 డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు సుమారు 25 వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
మధుమేహం మహమ్మారి విజృంభిస్తోంది. పెద్దలనే కాకుండా చిన్నారులపై తన ప్రతాపం చూపుతూ వేధిస్తోంది. పుట్టకతోనే పసికూనలపై దాడి చేస్తోంది. దీంతో జీవితాంతం సూదిపోటు తప్పడం లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఆసుపత్రులకు తీసుకెళ్లి ఇన్సులిన్ ఇప్పిస్తుండడం కన్నవాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలాంటి బాధితుల సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స