
మొదట్లో అర్హత...ఇప్పుడేమో అనర్హత
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎంతో ఆర్భాటం చేస్తోంది. అయితే ఈ కసరత్తులో పలుసార్లు తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన డీఎస్సీ తుది మెరిట్ జాబితాలో పలువురు అభ్యర్థుల ఫలితాల్లో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మొదట్లో విడుదల చేసిన ఫలితాల్లో కొంత మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పుడేమో తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో అనర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలను చూసిన అభ్యర్థులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. మొదట్లో అర్హత రావడం....ఇప్పుడు అనర్హత రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. అయితే ఆ హెల్ప్‌డెస్క్ నంబర్లు పనిచేయడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. తుది ఫలితాలు విడుదలైన సమయంలో హెల్ప్‌డెస్క్ నంబర్లు పనిచేయకపోవడంపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.