
25 నుంచి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ
తిరుపతి అర్బన్ : ఈనెల 25 నుంచి 33వ బ్యాచ్‌కి హెవీ డ్రైవింగ్ లెసెన్స్ కోసం శిక్షణ ప్రారంభిస్తామని అలిపిరి డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, అలిపిరి ఆర్టీసీ డీఎం హరిబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదికి 32వ బ్యాచ్ శిక్షణ పూర్తి అవుతుందని చెప్పారు. తర్వాత రెండు రోజుల అంతరం 33వ బ్యాచ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. మరోవైపు జిల్లాలో 10 మంది ఎస్సీ, ఎస్టీలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ ఉచితంగా ఇవ్వడానికి ఆదేశాలు రానున్నాయని చెప్పారు. ఎస్పీ కార్పొరేషన్ ద్వారా వారిని ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఎంపిక చేసిన వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అలిపిరి డిపోలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం శిక్షణ తీసుకున్న వారిలో 60శాతం మందికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు.
నేటితో ముగియనున్న డీఫార్మసీ దరఖాస్తులు
తిరుపతి సిటీ : ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు శనివారంతో ముగియనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే సాంకేతిక విద్యామండలి నుంచి తమకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు,
సత్యవేడు: ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో పరీక్షల్లో టాపర్లుగా మార్కులు పొందిన విద్యార్ధినీవిద్యార్థులకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. గురువారం పూర్వవిద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి జె.పాండురంగయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు బి.బాలసుందరంరెడ్డి, డి.రవి, బండారు మోహన్‌బాబు, ఆనంద్ కలసి రూ.10 వేలు, కె.పావని రూ.6వేలు, ఎం.దర్శిని, ఎం.అంకిత గ్రేస్ రూ.4 వేలు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మాధవీలత తదితరులు పాల్గొన్నారు.