
బాలిక అదృశ్యంపై ఫిర్యాదు
కలువాయి(సైదాపురం) : కలువాయి మండలం చిన్నగోపరం గ్రామానికి చెందిన బాలిక (17) ఈనెల 5వ తేదీన అదృశ్యమైనట్లు బాలిక తండ్రి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి చిన్న కుమార్తె కనపడలేదని, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటయ్య తెలిపారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
వెంకటగిరి రూరల్ : తెలుగు గంగ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. బంగారుపేటలోని పల్లెవీధికి చెందిన వేలూరు పెంచలయ్య(45) మంగళవారం మధ్యాహ్నం బహిర్భూమి కోసం తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ గట్టు మీద పెంచలయ్య మోటార్‌సైకిల్, చెప్పులను గుర్తించారు. అప్పటికే చీకటి పడిపోవడంతో బుధవారం ఉదయం కాలువలో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెక్‌బౌన్స్ కేసులో
నిందితుడికి జైలు
తిరుపతి లీగల్ : చెక్‌బౌన్స్ కేసులో తిరుపతి పద్మావతిపురానికి చెందిన మహేష్ నాయుడు అనే నిందితుడికి 6 నెలల జైలు శిక్ష , రూ.5వేల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు.
రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల సీజ్
– రూ.6లక్షల జరిమానా
తిరుపతి మంగళం : జిల్లా రవాణాశాఖ అధికారులు బుధవారం చేపట్టిన వాహన తనిఖీల్లో పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. రెండు బస్సులకు రూ.6లక్షల జరిమానా విధించారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలను తిప్పితే సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

బాలిక అదృశ్యంపై ఫిర్యాదు