
సచివాలయ సెక్రటరీలకు వేధింపులు
తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు సచివాలయ సెక్రటరీలకు వేధింపులు తప్పడం లేదు. అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సర్వేలు, టెలి కాన్ఫరెన్స్‌లతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీకి హాజరు కాలేదంటూ 281 మంది సచివాలయ సెక్రటరీలకు మెమోలు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు.
సర్కులర్ లేకుండానే..
తిరుపతి నగరంలో మంగళవారం ఉదయం 6 గంటలకే హర్ గర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సెక్రటరీలు హాజరుకావాలని ఎలాంటి సర్కులర్ జారీ చేయలేదు. కనీసం వాట్సాప్ గ్రూప్‌ల్లో సైతం మెసేజ్ కూడా పెట్టలేదు. కేవలం సోమవారం రాత్రి నిర్వహించిన పీ4 సర్వే టెలీ కాన్ఫరెన్స్‌తో కార్యదర్శులందరూ ర్యాలీకి రావాలని ఓ మాట చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది హాజరయ్యారు. అయితే అధికారులు తమ తప్పిదం మరచి సెక్రటరీలకు మెమోలు జారీ చేసేశారు.
ఎక్కువమంది మహిళలే
ఉదయం ఆరు గంటలకు నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీకి ఎక్కువమంది మహిళా సెక్రటరీలు హాజరు కాలేకపోయారు . మెమోలు జారీ చేసిన 281 మందిలో దాదాపు 190 మంది మహిళ సెక్రటరీలే ఉండడం గమనార్హం. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఉదయం 6 గంటలకే ర్యాలీకి హాజరు కావాలంటే మహిళలకు ఎంత ఇబ్బందో కూడా అధికారులు గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా పీ4 సర్వే సచివాలయ కార్యదర్శుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఒక్కరూ ఐదు కుటుంబాలను పీ4లో చేర్పించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడం ఇబ్బందిగా తయారైంది. వేళాపాళా లేకుండా టెలీకాన్ఫరెన్స్‌లు పెడుతుండడం సరికాదని కార్యదర్శులు వాపోతున్నా రు. అధికారులు చేయాల్సిన పనులు కూడా తమపై రద్దుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 16 గంటలపాటు పనిచేయిస్తున్నారని, పైగా తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సెక్రటరీలకు జారీ చేసిన మెమో
తిరంగా ర్యాలీకి రాలేదంటూ
281 మందికి మెమోలు