
ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్టు
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం చేసుకుని, స్మగ్లర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జి.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐ మురళీధర్ రెడ్డి టీమ్ స్థానిక ఎఫ్‌బీఓ లింగా నాయక్‌తో కలసి శనివారం రాత్రి నుంచి కడప జిల్లా ఖాజీపేట పరిధిలో కూంబింగ్ చేపట్టారు. పత్తూరు సమాధులు వద్ద ఒక కారులో కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒక స్మగ్లర్‌ను పట్టుకున్నారు. అతడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి నుంచి 9 ఎరచ్రందనం దుంగలతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అతడిని దుంగలతో పాటు, తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రాజు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
6 నుంచి తొండమాన్‌పురం వెంకన్న పవిత్రోత్సవాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్‌పురం శ్రీదేవి, భూదేవి స మేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నె ల 6 నుంచి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదివారం టీటీడీ పీఆర్వో ఓ ప్రకటన విడుదల చేశారు. 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రో త్సవాలు ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ ఉ దయం పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం యాగశాల లో వైదిక కార్యక్రమాలు, 8న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహించనున్నారు. 9న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేపడతారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు
కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నుట్లు ఆదివారం టీటీడీ పీఆర్వో ఓ ప్రకటన విడుదల చేశారు. 6న సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి, 7, 8వ తేదీల్లో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై విహరించనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు చేపట్టనున్నారు.