
ఎంపీడీఓను ప్రశ్నిస్తున్న వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి
బుచ్చినాయుడుకండ్రిగ : అధికారుల తీరుపై మండల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇష్టానుసారం నిధులు ఖర్చుపెడుతున్నారని, ప్రొటోకాల్‌ను పాటించడం లేదని ఆరోపించారు. అధికారుల వైఖరికి నిరసనగా మండల మీట్‌ను బహిష్కరిస్తున్నామని ఎంపీపీ మేకల సుబ్బలక్ష్మి, వైస్ ఎంపీపీలు మునికృష్ణారెడ్డి, మునెమ్మతోపాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు, 10 మంది సర్పంచ్‌లు వెళ్లిపోయారు. దీంతో కంచనపుత్తూరు ఎంపీటీసీ సభ్యులు కారణి చందన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ త్రివిక్రమ్‌రావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను అగౌరవపరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయాధికారి భారతి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను అందిస్తున్నామని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నీలిమ మాట్లాడుతూ 37 గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకులు మంజూరైనట్లు వెల్లడించారు. సమావేశంలో పీఆర్ ఏఈ నాగరాజు, డీటీ శివయ్య, కో–ఆప్షన్ మెంబర్ ఇమామ్‌బాషా పాల్గొన్నారు.
● మండల మీట్‌ను బహిష్కరించిన
ప్రజాప్రతినిధులు