కలలు.. కల్లలయ్యాయి.. జీవితమెంత విచిత్రమైంది

Young Man Died After Taking Injection At RMP In Warangal District - Sakshi

ఉన్నత చదువుల కోసం విదేశాలకు ప్లాన్‌ చేసుకున్న యువకుడు

12న జ్వరానికి ఆర్‌ఎంపీ వద్ద చికిత్స

ఇంజక్షన్‌ ఇచ్చిన వైద్యుడు.. ఆ ప్రదేశంలో నల్లగా మారిన శరీరం

హనుమకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింపు

చివరికి పరిస్థితి విషమించడంతో మృతి

మృతికి ఆర్‌ఎంపీతోపాటు ప్రైవేట్‌ వైద్యుడు కారకులని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఎల్కతుర్తి: ఇటీవల బీటెక్‌ అయిపోయింది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ మనం ఒకటి తలిస్తే.. విధి మరోటి తలుస్తుందని అంటుటారు.. అదే ఈ యువకుడి విషయం జరిగింది. జ్వరంరాగా స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చూయించుకున్నాడు. అతను ఇచ్చిన ఇంజక్షన్‌తో శరీరం నల్లగా మారడంతోపాటు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది.

మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి విజయ్‌(22) బీటెక్‌ పూర్తి చేశాడు. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న విజయ్‌కి జ్వరం రావడంతో జీల్గులకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రీనివాస్‌ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యుడు మాత్రలు ఇచ్చాడు. అయినప్పటికి విజయ్‌కి జ్వరం తగ్గకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆర్‌ఎంపీ వైద్యుడు ఇంజక్షన్‌ వేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంజక్షన్‌ వేసిన దగ్గర శరీరమంతా నల్లగా మారి ఇబ్బందులు పడ్డాడు. తిరిగి ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా మరికొన్ని మాత్రలు ఇచ్చి తగ్గకపోతే రావాలని సూచించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో మరోసారి ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు.

దీంతో ఆర్‌ఎంపీ.. విజయ్‌ చేతికి మరో ఇంజక్షన్‌ వేసి పంపించాడు. ఆ నొప్పి తీవ్రతరం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అశ్రిత్‌రెడ్డి.. విజయ్‌ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నాలుగు రోజుల తర్వాత రావాలని మందులు రాసి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన విజయ్‌ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఈనెల 14న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కాగా, ఆర్‌ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్‌తోపాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్‌ అశ్రిత్‌రెడ్డి విజయ్‌ మృతికి కారకులని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

మృతుడికి తల్లిండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. మృతుడి తండ్రి రవిందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేష్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఇటీవలే బావుపేటలో ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రీనివాస్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి బత్తిని సతీష్‌ అనే వ్యక్తి మృతిచెందిన విషయం మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top