వరంగల్ జిల్లా: భార్యాభర్తలు గొడవ ప డ్డారు. ఆవేశంతో సదరు మహిళ తన కుమారుడితో సహా ఇంటినుంచి వెళ్లిపోయింది. కాగా, ఎస్సారెస్పీ కాల్వలో దూకినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల శివారులో జరిగింది. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం..
క్రట్యాలకు చెందిన మేకల లింగయ్య చిన్న కూతురు కల్యాణిని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ కామిండ్ల రాజ శేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు శ్రేయాన్స్ (3) ఉన్నాడు. వరంగల్‌లోని రంగశాయి పేటలో వీరు ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో గొడవ జరిగింది. విషయాన్ని కల్యాణి తన సోదరి మమతకు ఫోన్‌లో తెలిపి ఇంట్లోనుంచి వస్తున్నానని చెప్పింది. శనివారం ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో కల్యాణి తన కుమారుడిని తీసుకుని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగింది.
వరంగల్ నుంచి తన కూతురు వస్తుందని తెలుసుకున్న తండ్రి లింగయ్య ఎదురుచూస్తుండగా, తమ వ్యవసాయ భూమి వైపు కుమారుడిని ఎత్తుకుని వెళ్తోందని కట్ట రాజు అనే వ్యక్తి తెలపడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూశాడు. వ్యవసాయ పొలం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ గట్టుపై కళ్యాణి, శ్రేయాన్స్‌కు సంబంధించిన చెప్పులు, బ్యాగు ఉన్నాయి. ఇద్దరూ కాల్వలో దూకి ఉంటారని లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్సై సాయిబాబు తెలిపారు. విషయం తెలుసుకున్న కళ్యాణి భర్త ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వచ్చి బోరున విలపించాడు.


