
వనమహోత్సవానికి ఉమ్మడి ఖమ్మంలో పైలెట్ ప్రాజెక్టు
కొత్తగూడెంలో జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి 25 ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2,600 మంది పిల్లలు ఉండే క్యాంపస్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని, 25 ఎకరాలకు పైగానే స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కొత్తగూడెంలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షలో భట్టి మాట్లాడారు.
హరితహారం పేరుతో విరివిగా మొక్కలు నాటామని గత ప్రభుత్వం చెప్పుకుందని, ఉమ్మడి జిల్లాలో ఏదైనా ఒక మేజర్ పంచాయతీని యూనిట్‌గా తీసుకొని గడిచిన పదేళ్లలో అక్కడ నాటిన మొక్కలు ఎన్ని? చేసిన ఖర్చు ఎంత? ఇప్పటివరకు బతికి ఉన్న మొక్కలు ఎన్ని అనే కచ్చితమైన వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఫలితాలను అనుసరించి రాబోయే రోజుల్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని లోపరహితంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మహిళా సంఘాలకు చేపపిల్లల బాధ్యత..
మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే చేపపిల్లల పెంపకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే యోచనలో ఉన్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.గతంలో నిర్మించిన, మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని, వీటిని ఆగస్టు 15లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ వానాకాలంలో వరద ముప్పు ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.