
బంజారాహిల్స్: యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణానగర్ బీ–బ్లాక్‌లో నివసించే రేణుక కొంతకాలం క్రితం చల్లా వినయ్‌కుమార్‌ను ప్రేమించింది. సదరు యువకుడు జులాయిగా తిరుగుతుండడంతో పాటు డ్రగ్స్‌కు బానిస కావడంతో యువతి కొంతకాలంగా దూరంగా ఉంటోంది.
దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు ఈనెల 9న యువతి పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి తీవ్రంగా కొట్టి ఆమె ద్విచక్రవాహనంపైనే బలవంతంగా ఎక్కించుకుని మద్యం మత్తులో వస్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో వారు వాహనాన్ని సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన యువతిని ద్విచక్ర వాహనం ఏదని తల్లి ప్రశ్నించగా మెకానిక్‌కు ఇచ్చానని చెప్పింది. అయితే తల్లికి అబద్ధం చెప్పానన్న బాధను తట్టుకోలేక ఈనెల 10న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
దీంతో మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు వినయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వినయ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతి ద్విచక్రవాహనం కూడా తన బాబాయిది కావడంతో పాటు పోలీసులు సీజ్ చేయడం, డ్రంకన్ డ్రైవ్‌లో వినయ్‌కుమార్ దొరకడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.