మూడో స్థానంలో తెలంగాణ
ఎగువ–మధ్య ఆదాయ పరిమితి రూ.4.40 లక్షలు కాగా.. తెలంగాణలో రూ.5.10 లక్షలు
ప్రపంచ బ్యాంక్ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారత్ దిగువ మధ్యస్థాయి ఆదాయ (లోయర్ మిడిల్ క్లాస్) దేశంగానే ఉన్నప్పటికీ తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఎగువ మధ్య ఆదాయ స్థాయి (అప్పర్ మిడిల్ క్లాస్)కి చేరుకున్నట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. తలసరి ఆదాయంలో తెలంగాణతోపాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి ఎదిగాయి. మరో మూడు రాష్ట్రాలు.. హరియాణా, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిని అందుకోవడానికి అత్యంత సమీపంలో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం.. వార్షిక తలసరి ఆదాయం రూ.3.88 లక్షలు దాటిన రాష్ట్రాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. దేశంలో అత్యధిక తలసరి ఆదాయంతో ఢిల్లీ (రూ.5.90 లక్షలు) మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక (రూ.5.29 లక్షలు), తెలంగాణ (రూ.5.10 లక్షలు), తమిళనాడు (5.05 లక్షలు), గుజరాత్ (రూ.4.49 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ సగటు తలసరి ఆదాయం (రూ.2.61 లక్షలు)తో పోలిస్తే ఈ రాష్ట్రాలు ఎంతో ముందంజలో ఉండటం విశేషం. ప్రపంచ బ్యాంకు ఎగువ–మధ్య ఆదాయ పరిమితి రూ.4.40లక్షలుగా ఉంది. కాగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచబ్యాంక్ ‘కంట్రీ ఇన్‌కమ్ క్లాసిఫికేషన్స్–2026’ పేరుతో రూపొందించిన నివేదికలో భారత ఆర్థికస్థితపై ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం..
⇒ బిహార్ (తలసరి ఆదాయం రూ.93వేలు), ఉత్తరప్రదేశ్ (1.33 లక్షలు) వంటి రాష్ట్రాలు నేపాల్ లేదా సబ్–సహారన్ ఆఫ్రికా దేశాల కంటే తక్కువ ఆదాయ స్థాయితో ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి.
⇒ ప్రపంచ దేశాలతో పోలిస్తే ఒకప్పుడు (1994లో) భారత్‌లో ఒక్క రాష్ట్రం కూడా మిడిల్–ఇన్‌కమ్ కేటగిరీలో లేదు. కానీ నేడు టాప్ 5 రాష్ట్రాల తలసరి ఆదాయం దక్షిణాఫ్రికా (రూ.5.95 లక్షలు), మంగోలియా (రూ.5.89 లక్షలు) వంటి దేశాల ఆర్థిక స్థాయికి దరిదాపుల్లో ఉండటం గమనార్హం.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై నిపుణులు ఏమన్నారంటే...
⇒ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్నప్పటికీ, జీఎస్‌డీపీలో విద్యారంగానికి తెలంగాణ కేవలం 2 శాతం బడ్జెట్‌నే కేటాయిస్తోంది.
⇒ ఇది జాతీయ సగటు కంటే 38% తక్కువ.
⇒ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరిగాయి. ఇది సామాన్యులకు గృహవసతి పొందే అవకాశాలను దూరం చేస్తోంది.
⇒ పెరిగిన సంపద అంతా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలకే (రంగారెడ్డి, మేడ్చల్) పరిమితం కాగా... గ్రామీణ తెలంగాణలో ఆదాయ అసమానతలు కొనసాగుతున్నాయి.
⇒ 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అందుకోవాలంటే కేవలం ఐటీ రంగాన్నే కాకుండా, విద్య, వైద్య రంగాలపైనా ప్రభుత్వ పెట్టుబడులను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.
తెలంగాణపై నివేదికలో ఏముందంటే..
⇒ హైదరాబాద్ కేంద్రంగా ఐటీ ఎగుమతులు, సేవా రంగం, గ్లోబల్ క్యాపిటల్ ఇన్ ఫ్లోస్ రాష్ట్ర ఆదాయాన్ని భారీగా పెంచాయి.
⇒ తెలంగాణ ఆర్థిక సమర్థత ప్రస్తుతం అల్జీరియా, హంగేరి వంటి ఐరోపా దేశాల ఉత్పాదకత స్థాయి వైపు దూసుకుపోతోంది.
⇒ ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కంటే కేవలం 6% మాత్రమే ముందున్న తెలంగాణ తలసరి ఆదాయం, ప్రస్తుతం ఏపీ కంటే 130% అధికంగా ఎదిగింది.


