Work From Office: 3 New Traffic Sectors in Hyderabad IT Corridor, బ్యాక్‌ టు ‘ట్రాఫిక్‌ రూల్స్‌’ - Sakshi
Sakshi News home page

Hyderabad-Work From Home: వర్క్‌ ఫ్రం ఆఫీస్‌.. బ్యాక్‌ టు ‘ట్రాఫిక్‌ రూల్స్‌’

Published Wed, Mar 9 2022 3:55 PM

Work From Office: 3 New Traffic Sectors in Hyderabad IT Corridor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దశల వారీగా ‘వర్క్‌ ఫ్రం ఆఫీస్‌’ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులూ సన్నద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్‌లో క్రమగా వాహనాల రద్దీ పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్‌ బస్సులలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతుండటంతో ఐటీ కారిడార్‌ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోంది. ఇప్పటికే ఆయా కారిడార్లలోని ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద పని చేయని సిగ్నల్స్, సీసీ కెమెరాలను రిపేరు చేసి పోలీసులు నిర్వహణకు సిద్ధం చేశారు.  

రెండున్నరేళ్ల తర్వాత... 
► కరోనా ప్రభావంతో మొదలైన వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.  

► దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు దశల వారీగా ఉద్యోగులు హాజరయ్యేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.  

► తొలుత సగం మంది ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు వచ్చేలా.. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.  

► సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (క్లిక్‌: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ భారీ డేటా సెంటర్‌)

► ఐటీ కారిడార్‌లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల రద్దీ పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే జంక్షన్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్‌ జాం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని చేయని సిగ్నళ్లు, పాడైపోయిన కెమెరాలను బాగు చేయడంతో పాటూ, వార్షిక సర్వీస్‌లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

కొత్తగా మూడు సెక్టార్లు..
ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 10 ట్రాఫిక్‌ పీఎస్‌లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో కొత్తగా మూడు ట్రాఫిక్‌ సెక్టార్లు ఏర్పాటు చేశారు. సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలకు వస్తుంటారు. దీంతో ఆయా ట్రాఫిక్‌ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, ట్రాఫిక్‌ నియంత్రణ సులువవుతుందని అధికారులు భావించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోటీస్‌ స్టేషన్ల పరిధిలో కొత్తగా మూడు సెక్టార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.  

► మాదాపూర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో రాయదుర్గం సెక్టార్‌ 
► గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో నార్సింగి సెక్టార్‌ 
► కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో కేపీహెచ్‌బీ సెక్టార్‌ను ఏ ర్పాటు చేశామని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు.  
► ఒక్కో సెక్టార్‌కు ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు, 45 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. (క్లిక్‌: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్‌ బేస్డ్‌ యూనికార్న్‌ కంపెనీ)

Advertisement
Advertisement