హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ భారీ డేటా సెంటర్‌

Microsoft Going to Establish Largest Data Centre In Hyderabad - Sakshi

15 ఏళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి

2025 నాటికి తొలి ఫేజ్‌ రెడీ..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా డిజిటల్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అతి పెద్ద డేటా సెంటర్‌ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్‌లో మొదటి ఫేజ్‌ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతున్నట్లు డేటా సెంటర్‌ ప్రకటనకు సంబంధించి కంపెనీ సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.

‘‘భారత్‌లో అత్యంత భారీ మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ గమ్యస్థానం కావడం సంతోషంగా ఉంది. వచ్చే 15 ఏళ్లలో దీనిపై రూ. 15,000 కోట్ల మేర సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలోకి వచ్చిన అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇది రెండోది అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్‌ పరోక్షంగా స్థానిక వ్యాపారాల అభివృద్ధికి .. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీల మేనేజ్‌మెంట్, డేటా .. నెట్‌వర్క్‌ భద్రత, నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పనకు దోహదపడగలదని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌ తదితరులు పాల్గొన్నారు.  

భారత్‌లో నాలుగోది ...
మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్‌ రీజియన్లు ఉండగా .. హైదరాబాద్‌లోని నాలుగోది కానుంది. ఇది కంపెనీలు, స్టార్టప్‌లు, డెవలపర్లు, ప్రభుత్వ సంస్థలు మొదలైన క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం) తదితర సొల్యూషన్స్‌ అందించనుంది. సాధారణంగా ఇలాంటి డేటా సెంటర్‌ ఏర్పాటుకు కనీసం 24 నెలలు పడుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి చెప్పారు. క్రమంగా ఇన్వెస్ట్‌ చేస్తూ దీన్ని అతి పెద్ద సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్లు.. భారత ఎకానమీకి 9.5 బిలియన్‌ డాలర్ల మేర ఆదాయాన్ని సమకూర్చాయని అనంత్‌ మహేశ్వరి వివరించారు.

చదవండి: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top